పులుసు మామిడి వాగు వరద ఉధృతిలో గల్లైంతైన వ్యక్తి మృతి

Published: Wednesday September 29, 2021
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజాపాలన : గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా సోమవారం సాయంత్రం నుండి భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షాలతో జిల్లా వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గంలోని కుంటలు, చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల వలన వాగులు వంకలు ఉగ్ర రూపం దాల్చాయి. ఉప్పొంగి ప్రవహించే వాగులను దాటే ప్రయత్నంలో వరద ఉధృతిలో పడి కొట్టుకొనిపోయి మృత్యువాత పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గులాబ్ తుఫాన్ వలన భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. హెచ్చరికలను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ద్విచక్ర వాహనదారులు వరద ఉధృతిలో పడి కొట్టుకొనిపోయి మృతి చెందుతున్నారు. తమ కుటంబంలో విషాదానికి తామే కారణమవుతున్నారు. వరద ఉధృతిని అంచనా వేయలేక దాటే ప్రయత్నంలో మృత్యువాత పడుతున్నారు. అందుకు ఉదాహరణ వికారాబాద్ జిల్లాలో గల వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామానికి చెందిన వ్యక్తి పులుసుమామిడి గ్రామంలో 7వ వార్డు మెంబర్ ఇసాక్ పాష (28) వాగుదాటే క్రమంలో మృత్యువాత పడ్డాడు. భారీ వర్షంతో వికారాబాద్ మండల పరిధిలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. హైదరాబాద్ నుండి తన స్వంత గ్రామం పులుసుమామిడికి వచ్చేందుకు సోమవారం బైక్ పై బయలుదేరాడు. అప్పటికే భారీ వర్షాలు కురుస్తుండడంతో మండల పరిధిలోని వాగుల వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. ఇసాక్ పాష పులుసుమామిడి వాగు వరకు చేరుకున్నాడు. పహారా కాస్తున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పులుసుమామిడి వాగు దాటే ప్రయత్నం చేస్తున్న ఇసాక్ పాషను వాగు దాటొద్దని వారించారు. వారించినా వినకుండా వాగు దాటే ప్రయత్నంలో వరద ఉధృతిలో బైక్ తో పాటు తాను కొట్టుకొనిపోయాడు. అక్కడే పహారా కాస్తున్న వారు గాలించిన ప్రయత్నం శూన్యమయ్యింది. వరద ఉధృతిలో ఒక వ్యక్తి కొట్టుకొనిపోయాడన్న సమాచారాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పి ఎం.నారాయణ, డిఎస్పి సంజీవరావు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. చీకటి ఎక్కువ అవడంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు వేగవంతం చేయించారు. గాలింపు చర్యలలో భాగంగా నవాబ్ పేట్ మండల పరిధిలోని చించల్ పేట్, అత్తాపూర్ వాగు మధ్యలో ఇసాక్ పాష మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి రక్త సంబంధీకులకు శవాన్ని అప్పగించారు. కుటంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.