వరి ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలి

Published: Friday May 21, 2021

చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యల జిల్లా ప్రతినిధి, మే 20, ప్రజాపాలన : మే మాసాంతం లో గా జిల్లాకు కేటాయించిన వరి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పూర్తిస్థాయిలో చేయాలని, రైతులకు లాభం కలిగే విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలని చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య లతో కలిసి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ  జిల్లాకు కేటాయించిన లక్షా 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 91 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకూ 74 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించడం జరిగిందని, చెన్నూరు నియోజకవర్గ పరిధిలో 91 కొనుగోలు కేంద్రాలలో 31 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 27 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. , బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని 38 కొనుగోలు కేంద్రాలలో 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 3,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించడం జరిగిందని, మిగిలిన ధాన్యాన్నినిర్ణీత గడువులోగా అందించే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ధాన్యం తరలించేందుకు 523 లారీలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే ఇసుక లారీలను వినియోగించుకోవాలని తెలిపారు. ఐదు రోజులలో గా అన్ లోడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ధాన్యం ఉంచేందుకు స్థలం సరిపోని పక్షంలో ప్రైవేటు భవనాలు, ఫంక్షన్ హాల్స్, రైతు వేదికలు ఉపయోగించుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా జరిగే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు గన్నీ సంచులు, టార్పాలిన్లు అవసరమైన మేరకు అందుబాటులో ఉంచుకోవాలని, జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. రైతులు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, మార్క్ ధరింపు, శానిటైజర్ వినియోగం, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా రవాణా అధికారి కిష్టయ్య, డి సి ఎం ఎస్ అధికారులు, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ గోపాల్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నలమాసు కాంతయ్య, రైస్ మిల్లర్లు, లారీ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.