గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి

Published: Tuesday October 05, 2021
మూలమాడ గ్రామ సర్పంచ్ కందాడ సుభాన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 04 అక్టోబర్ ప్రజాపాలన : గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని మూలమాడ గ్రామ సర్పంచ్ కందాడ సుభాన్ రెడ్డి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటి వరకు స్మశానవాటిక, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్ వంటి పనులను పూర్తి చేశానని పేర్కొన్నారు. పాపిరెడ్డి ఇంటి దగ్గర కల్వర్ట్ నిర్మాణం చేశానని వివరించారు. ఎస్సీ వాడలో లక్ష రూపాయల నిధులతో అండర్ డ్రైనేజీ నిర్మాణం పూర్తయ్యిందని స్పష్టం చేశారు. పల్లె ప్రకృతిలో భాగంగా గ్రామాంతర్గత రోడ్లలో ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చామని చెప్పారు. ఊరి బయటి నుండి వచ్చే మోరీకి 30 ట్రిప్పుల ట్రాక్టర్ల మట్టి కొట్టాల్సి వచ్చిందని ఉద్ఘాటించారు. గ్రామంలో 3 మినీ ట్యాంకులను నిర్మించారు. వాటర్ ట్యాంకుకు రంగులు వేయించామన్నారు. గ్రామాభివృద్ధికి వచ్చిన నిధులు జీతాలు, కరెంట్ బిల్లు, కాలిన మోటర్ల రిపేరింగుకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి ప్రతి నెల 56 వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయని వివరించారు. పాఠశాలల భవనాలకు సున్నం వేయించడానికి 40 వేల రూపాయలు ఖర్చయ్యాయని వివరించారు.