మన ఊరు - మన బడి ద్వారా నాణ్యమైన విద్య. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి.

Published: Thursday December 29, 2022
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్28, ప్రజాపాలన: 
 
విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని మౌళిక వసతులు, సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్తో కలిసి జిల్లా విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు, ఏ.ఈ.లు, డి.ఈ.లు, ఈ. ఈ. లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని, పిల్లలను విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం ద్వారా భావి తరాల భవిష్యత్తు బావుంటుందని, ఈ దిశగా మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలో మొదటి విడతలో 248 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో 158 ప్రాథమిక పాఠశాలలు, 31 ప్రాథమికోన్నత పాఠశాలలు, 59 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. పాఠశాలల్లో చేపడుతున్న వంటశాలలు, భోజన శాలలు, మూత్రశాలలు, శౌచాలయాలు, అదనపు గదులు, ప్రహారీగోడ ఇతరత్రా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులు నాణ్యతపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరుపాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా నిర్వహించాలని, మొక్కలు నాటి సంరక్షించాలని తెలిపారు. 30 లక్షల రూపాయల లోపు వ్యయం గల పాఠశాలలు 212, 30 లక్షల రూపాయలకు పైబడి వ్యయం గల పాఠశాలలు 30 ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో అత్యున్నత స్థానంలో నిలిచేందుకు ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందించే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా మండల విద్యాధికారులు, పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించి పనులు నాణ్యతగా జరిగే విధంగా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలం నుండి 2 పాఠశాలల్లో జనవరి 7వ తేదీ వరకు పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, మండల విద్యాధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.