విఆర్ఓ పదవి పోయినా... పైరవీలకు కొదువలేదు

Published: Thursday December 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : రెవెన్యూ శాఖలో విఆర్ఓ లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఉద్దేశ్యంతో విఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. విఆర్ఓ లపై వచ్చిన అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పని చేస్తున్న విద్యార్థులను రెవెన్యూ అధికారులు తమ అవసరాలకు వినియోగించుకొని పబ్బంగడుపుతున్నారు. చింత చచ్చినా పులుపు చావని కొందరు విఆర్ఓ లు పదవి పోతేనేమి.. పైరవీలకు కొదువా అనే చందంగా వ్యవహరిస్తున్నారు. విఆర్ఓలకు ప్రస్తుతం ఎటువంటి అధికారాలు లేకున్నా అన్నింటా తలదూరుస్తున్న పదవీచ్యుత విఆర్ఓ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ప్రముఖ ప్రజాప్రతినిధితో ఛివాట్లు తిన్నా తన వక్రబుద్ధిని మార్చుకోకపోవడం విశేషం. ధారూర్ మండలం కేరెల్లి విఆర్ఓగా పని చేసిన శంకర్ నాయక్ పైరవీకారునిగా అవతారమెత్తినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కొండాపూర్ కుర్డు గ్రామానికి చెందిన రైతుల దగ్గర అటవీ ప్రాంతంలో నక్ష బాట  వేసుకోవడానికి రైతుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. అటవీ శాఖ అధికారిణి తనకు దగ్గరి బంధువు అవుతుందని, ఆమెను కూడా చూసుకోవాల్సి ఉంటుందని రైతుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులు త్వరగా ఇప్పిస్తానని చెప్పి తహసిల్దార్ కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని లబ్ధిదారుల నుంచి పది వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు వసూలు చేసినట్టు పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి నో పిటి, కాస్రా, పహాణి తదితర సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, దీనికి గాను తాసిల్దార్, ఇతర అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని వసూలు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొండాపూర్ కుర్డు గ్రామంలో పలు రైతులకు విరాసత్ చేసినందుకు దీనికి బదులుగా సదరు రైతుల నుంచి బంగారు కాయిన్లను బహుమతి తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో ఉన్న ముఖ్య అధికారి కూడా తనకు బంధువు ఆవుతారని విఆర్ఓ శంకర్ నాయక్ అడ్డూ అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారి, అటవీ శాఖ అధికారి, తాసిల్దార్ లను అడ్డుగా పెట్టుకొని సదరు వీఆర్వో అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న శంకర్ నాయక్ ధారూర్ మండలం నుంచి మరో మండలానికి బదిలీ చేయాలని పలువురు కోరుతున్నారు.