పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి

Published: Friday February 19, 2021
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మహేందర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి 18 ( ప్రజాపాలన ) :  పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను  తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మహేందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై మహేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని మరిచి కార్పోరేట్ శక్తులకు సేవలు చేస్తోందని విమర్శించారు.  కరోనా కాలంలో పేద ప్రజలు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఉపాధి కల్పించకుండా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుచారని దెప్పి పొడిచారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో బిజెపి ప్రభుత్వం ముందంజలో నడుస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టుకుంటూ కార్పోరేట్ ఊడిగం చేయడం సమంజసం కాదని చెప్పారు. సామాన్యుని నిత్యావసరాల ధరలు అదేవిధంగా పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వై. గీత, గోపాల్, శ్రీశైలం మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభావతి, పద్మమ్మ, మహేందర్, ప్రేమలమ్మ పాల్గొన్నారు.