ఘనంగా ప్రారంభమైన అతి రుద్ర మహా యజ్ఞ సప్తాహం

Published: Thursday December 22, 2022

ఆధ్యాత్మిక సేవ మండల సమితి సభ్యులు తాండూరి రాజు భోగేశ్ పంతులు

వికారాబాద్ బ్యూరో 21 డిసెంబర్ ప్రజా పాలన : లోక కళ్యాణార్థం అతిరుద్ర మహా యజ్ఞ సప్తాహ కార్యక్రమం సోమవారం చిగుళ్లపల్లి మైదానంలో ఘనంగా ప్రారంభమైందని ఆధ్యాత్మిక సేవ మండల సమితి సభ్యులు తాండూరి రాజు భోగేశ్ పంతులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సమస్త ప్రాణికోటి సుఖ సంతోషాలతో వర్ధిల్లేందుకు యజ్ఞ యాగాదులు హితోదికంగా తోడ్పడతాయని వివరించారు. యజ్ఞం నుండి ఉద్భవించే పలు రకాల సుగంధ ద్రవ్యాల సువాసనల పొగలు సమస్త భక్తకోటికి ప్రేరణగా ఉత్తేజితంగా ఉంటుందని స్పష్టం చేశారు. నేటి ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక దైవచింతన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. హింస ప్రవృత్తి నశించి సత్ప్రవర్తనతో మెలిగే జీవన స్రవంతిని యజ్ఞ యాగాదుల ద్వారా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం ఐదు గంటలకు ఓంకారము సుప్రభాతం ఐదు గంటల 30 నిమిషాలకు నగర సంకీర్తన 7 గంటలకు గణపతి పూజ పుణ్యాహవాచనము మాతృక నాంది అఖండ దీపారాధన ధ్వజారోహణము గోపూజ అంకురార్పణ యాగశాల ప్రవేశము బ్రహ్మాది మండల యోగిని వాస్తు క్షేత్రపాల నవగ్రహ సుదర్శన రాజశ్యామల నవార్ణవ మండపముల స్థాపన అగ్ని ప్రతిష్ఠ మహాన్యాస పూర్వక సంతత ధారాభిషేకము మధ్యాహ్నం మూడు గంటలకు మహాగణపతి హవనము అతిరుద్ర స్వాహాకారము శత చండీ రాజశ్యామల మహా సుదర్శన సంకల్పిత దేవతా హవనములు రాత్రి 7 గంటలకు మహా మంగళ హారతి వేద సేవ ఆశీర్వచనము తీర్థ ప్రసాద వితరణ రాత్రి 8 గంటలకు అఖండ భజన కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా మొదటి రోజు పూర్తయింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ మంత్రి బిజెపి నాయకులు ఏ చంద్రశేఖర్ పూర ప్రముఖులు ఆధ్యాత్మిక సేవా మండలి సభ్యులు నగర ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.