అభివృద్ధి నిధులతో పనులు పూర్తి చేయాలి

Published: Wednesday March 16, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 15 మార్చి ప్రజాపాలన : నియోజకవర్గం అభివృద్ధి నిధులు (సిడిపి) తో ఇప్పటికే మంజూరైన పనులను వెంటనే చేపట్టి నెల రోజులలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ప్లానింగ్, ఇంజనీరింగ్ మరియు మున్సిపల్ అధికారులతో ప్రణాళిక పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, 2016-17 నుండి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు నియోజక వర్గాల వారిగా మంజూరైన అభివృద్ధి పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సీడీపీ, యస్డియఫ్, సిబియఫ్, ఎంపి నిధులతో నియోజక వర్గాల వారిగా చేపట్టిన సీసీ రోడ్లు, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, బోర్వెల్స్, కల్వర్ట్ లు, మురికి కాలువల నిర్మాణపు పనులను నెల రోజులలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పురోగతిలో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి, ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాని పనులను వెంటనే గ్రౌండింగ్ చేసి పనులను వేగవంతం చేయాలన్నారు.  సమస్యాత్మక పనులను రద్దు చేయాలని ఈ సందర్బంగా ఆయన సూచించారు. మున్సిపల్ పరిధిలో మంజూరైన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. ఇట్టి పనులను నెల రోజులలో పూర్తి చేసి నిధులను అభివృద్ధి పనులకు సద్వినియోగం చేయాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి నిరంజన్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కల్పన సంస్థ డిఈ రాజు, మున్సిపల్ కమీషనర్లు, డిఈలు, ఎఈ లు తదితరులు పాల్గొన్నారు.