సర్పంచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేడుకలు

Published: Monday April 11, 2022
తల్లాడ, ఏప్రిల్ 10 (ప్రజాపాలన న్యూస్): శ్రీరామనవమిని పురస్కరించుకొని తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి దేవాలయంలో రాములోరి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణాన్ని డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు వీక్షించారు. ముత్యాల తలంబ్రాలను ముస్లిం సోదరులు అక్బర్ కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. పీటలపై మహేంద్ర కుమార్, ఇమ్మడి లక్ష్మీనారాయణ, కళ్యాణపు పెద్ద సత్యం, చెరుకూరి వెంకటేశ్వరరావు దంపతులు కూర్చున్నారు. గ్రామంలో భక్తులందరూ చూస్తుండగా స్వామి వారి కళ్యాణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ శెట్టిపల్లి లక్ష్మణరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తమ్మినేని పాపారావు, కళ్యాణపు కృష్ణయ్య, కళ్యాణపు శ్రీను, చెరుకూరి గోపాల రావు, కళ్యాణ వెంకటయ్య, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.