మామిడి ఉత్పత్తి పై ముందస్తు అవగాహన : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday March 25, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 24 (ప్రజాపాలన) : కుల్కచర్ల మండల రైతులు అందరు ఎఫ్ పిఒ ద్వారా అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేశారు. బుధవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశపు హలులో శ్రీరామ లింగేశ్వర సిిరిధాన్యాల మహిళా రైతు ఉత్పత్తి దారుల సంస్థ (ఎఫ్ పిఒ) రైతులకు మామిడి ఉత్పత్తిపై ముందస్తు ప్రణాళిక అవగాహన సదస్సు ఏర్పాటు చేసినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, గత సంవత్సరం ఎఫ్ పిఒ ద్వారా 94 టున్నుల మామిడి పండ్లను రైతుల నుండి సేకరించి విక్రయించడం జరిగిందని, ఈసారి 102 మంది రైతుల నుండి 165 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు గాను రైతుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండలంలోని రైతులు చిరు ధాన్యాలు ఎక్కువ పందిస్తున్నందున వారి సౌకర్యార్థం ఒక మిల్లింగ్ ప్రాసెసర్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  అలాగే ఎఫ్కు పిఒ కొత్తగా ఒక మల్టిక్రాప్ హార్వెస్టర్ ను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసినారు. మండలంలో రాబోవు రోజులలో మామిడి, చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ మామిడి మొక్కలు నాటుకోవడానికి అవకాశం ఉన్నదని తెలిపారు.  మామిడి రైతుల పంట దిగుబడి, లాభాలు ఎక్కువగా వచ్చే విధంగా ఒకేసారి కాకుండా కనీసం మూడు సార్లు పంటను తెంపే విధంగా అవగాహన కల్పించారు. ఇట్టి పండ్లను గ్రేడింగ్ చేసి అమ్మడంవల్ల అధిక లాభాలు వస్తాయని సూచించారు. అధికారులు మామిడిపంట ఉత్పత్తిపై, మార్కెటింగ్ పై  అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ మండలంలోని కామునిపల్లి గ్రామ స్మశాన వాటిక నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ మంది కార్మికులను పెట్టి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున బేస్మెంట్ పనులు పూర్తి చేయించి మొదటి విడత బిల్లులు చెల్లింపునకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, హార్టికల్చర్ అధికారి చక్రపాణి, డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం శోభా, జడ్పీటీసీ రాందాస్ నాయక్, కంపెనీ డైరెక్టర్ కవిత, మండల మహిళా సంఘం అధ్యక్షులు అలివేలు, PR/AE ఉమేష్ కుమార్, సర్పంచ్ మహిపాల్ రెడ్డి, ఎంపీడీఓ సుందర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.