ఫారెస్ట్ అధికారుల పై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి కేసీఆర్

Published: Wednesday November 23, 2022
భద్రాద్రి కొత్తగూడెం ( ప్రజా పాలన.)
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస రావు మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిపి శ్రీ మహేందర్ రెడ్డిని సీఎం ఆదేశించారు. మరణించిన ఎఫ్.ఆర్.ఓ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాస రావు డ్యూటీలో వుంటే ఏవిధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు  అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎఫ్.ఆర్.ఓ పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ లు ఎఫ్.ఆర్.ఓ అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం ఆదేశించారు.విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని, ఈ సందర్భంగా సీఎం భరోసా ఇచ్చారు.