భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Published: Tuesday June 21, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 20 ప్రజాపాలన :
ప్రజావాణిలో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత తహసీల్దార్లు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన  ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కొరకు 140  ఫిర్యాదులు స్వీకరించినట్లు,  వాటి పరిష్కారం నిమిత్తం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.  గత నెల 15 రోజులుగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు ఇతర అత్యవసర పనుల కారణంగా కమిటీ సమావేశాలు నిర్వహించనందున దాదాపు 1900 జిఎల్ఎం కేసులు పెండింగ్ లో ఉన్నాయని వీటి పరిష్కారం కొసం మండలాల వారిగా కమిటీ సమావేశాలు నిర్వహించి త్వరగా భూ సమస్యలు పరిష్కరించునున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఈనెల 30 వరకు ప్రతి పెండింగ్ దరఖాస్తు వివరాలు సిద్ధం చేసి అందజేస్తే జులై, 1 వరకు అన్ని దరఖాస్తులు క్లియర్ చేసేందుకు వీలు పడుతుందన్నారు.  జిల్లాలో సర్వే సమస్యలు, ఫారెస్ట్ భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.  సర్వేయర్లను పిలుపించుకొని ఇట్టి పెండింగ్ పనులను ఆన్ లైన్ లో అప్లోడ్ చేసినట్లయితే క్లియర్ చేయుటకు వీలు పడునని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారిని విజయకుమారి, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ రావు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ ఏడి రాంరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అమరేందర్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.