మైలార్దేవరంపల్లిలో బస్సు కోసం విద్యార్థుల ధర్నా

Published: Wednesday November 23, 2022
* విద్యాలయాలకు ఆలస్యంగా చేరుకుంటున్న విద్యార్థులు
* ప్రత్యేక బస్సు వేయాలని విద్యార్థుల ఆందోళన
* పలుమార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టిన అధికారులు
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజా పాలన : కోటపల్లి నుండి వికారాబాద్ కు వచ్చే ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండు గర్భిణిలా వస్తున్నదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు పాసులు కలిగిన విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాలయాలకు ఆలస్యంగా వెళితే ఫస్ట్ పీరియడ్ పాఠాలు నష్టపోవలసి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ డిపో మేనేజర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. అష్ట కష్టాలు పడి బస్సులో ఎక్కేందుకు ప్రయత్నిస్తే కండక్టర్ డ్రైవర్లచే తిట్ల దండకం వినాల్సి వస్తుందని బాధను వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ధర్నాతో వికారాబాద్ టు కోటపల్లి, కోటపల్లి టు వికారాబాద్ రాకపోకలు కొనసాగించే బస్సులు సుమారుగా మూడు గంటల పాటు స్తంభించాయి. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు వికారాబాద్ డిఎం డౌన్ డౌన్. నడపాలి నడపాలి మైలార్ దేవరంపల్లి టు వికారాబాద్. వికారాబాద్ టు మైలార్దేవరం పల్లి వరకు బస్సును విద్యాలయాల సమయాలలో రాకపోకలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. మైలార్ దేవరంపల్లి గ్రామానికే చెందిన సుమారు 150 మంది విద్యార్థులు బస్ పాస్ హోల్డర్లు ఉన్నారని చెప్పారు. కోటపల్లి నుండి వికారాబాద్ కు వచ్చే బస్సులో వెళ్లాలంటే సాధ్యం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ డిపో మేనేజర్ స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి మైలార్దేవరంపల్లి గ్రామ విద్యార్థుల బాధలను అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల ధర్నాకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ఇంటెంట అరుణ్ సంబంధిత కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. వికారాబాద్ పట్టణ సిఐ టంగుటూరి శ్రీను మైలార్దేవరంపల్లి లో ధర్నాలో పాల్గొన్న విద్యార్థులకు నచ్చజెప్పి వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా సద్దుమణిగింది. అనంతరం మైలార్దేవరం పల్లి గ్రామ సర్పంచ్ ఆలంపల్లి తిరుపతిరెడ్డి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని వికారాబాద్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. వెంటనే డిపో మేనేజర్ మహేష్ కుమార్ స్పందించి ఉదయం సాయంకాలంలో బస్సు నడిపేందుకు అంగీకరించారు.