ఎల్లకొండలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల బ్రహ్మోత్సవాలు

Published: Thursday March 02, 2023
వికారాబాద్ బ్యూరో 01 మార్చి ప్రజాపాలన : పవిత్ర పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు పుట్టినిల్లు భారతదేశం. సమస్త దేవతా క్షేత్రాలలో ఒకటిగా వెలిగి దక్షిణ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా యందు నవాబుపేట మండలంలో గల ఎల్ల కొండపై క్రీ.శ.9 శతాబ్ద కాలంలో స్వయంభువుగా వెలసిన శ్రీశ్రీశ్రీ పార్వతీ పరమేశ్వరులను కొలచిన వారి కోరికలు తీర్చే కొండపై దేవతలుగా విరాజిల్లుతున్నారు. పరమశివుని వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో వేలాదిమంది భక్తుల సమక్షంలో పూజారులు దేవాలయ వంశపారంపర్య ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో జరుపబడుచున్నది. స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సర మాఘమాస బహుళ త్రయోదశి మహాశివరాత్రి 2023 ఫిబ్రవరి 18 మొదలుకొని పాల్గుణ శుద్ధ ద్వాదశి శనివారం 2023 మార్చి 4 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని గ్రామ సర్పంచ్ రావు గారి వెంకట్ రెడ్డి, ఆలయ ధర్మకర్త పట్లోళ్ళ భరత్ రెడ్డి ఆలయ అర్చకులు మడుపతి ఆనందం స్వామి మడుపతి చంద్రయ్య స్వామి తెలిపారు. మార్చి ఒకటి బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు సాయంత్రం 6 గంటలకు కలశరోహణము మార్చి 2 గురువారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు రథోత్సవం మార్చి మూడున శుక్రవారం నిండు జాతర మార్చు నాలుగు శనివారం నాగవెల్లి తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. సమస్త భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.