అసంపూర్తి వంతెనల నిర్మాణాలు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Tuesday September 28, 2021

వికారాబాద్ బ్యూరో 27 సెప్టెంబర్ ప్రజాపాలన : అసంపూర్తి వంతెనల నిర్మాణాలు పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆర్ అండ్ బీ శాఖ మంత్రి రసమయి బాలకిషన్ దృష్టికి తెచ్చారు. ధారూర్ స్టేషన్ దోర్నాల మధ్యలో గల వంతెన నిర్మానికి 4, 5 సంవత్సరాల క్రితమే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 శాతం కూడా పనులు కొనసాగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతకు ముందే సంబంధిత మంత్రి దృష్టికి తెచ్చానని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ తో మాట్లాడి పూర్తి చేయిస్తారా లేదా మరో కాంట్రాక్టర్కు అప్పగిస్తారా అని శాసన సభలో ప్రశ్నించారు. వికారాబాద్ మండలంలోని పులుసుమామిడి, సిద్దు లూరులలో మంజూరైన వంతెనల నిర్మాణాలు స్లాబ్ వరకు వచ్చాయని ఉద్ఘాటించారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ధారూర్ నుండి తాండూర్ వెళ్లే రహదారిలో గల పెద్దేముల్ మార్గంలో నాగసమందర్ దగ్గర తాత్కాలిక వంతెన వర్షం వచ్చినప్పుడల్లా కొట్టుకొనిపోతుందని విచారం వ్యక్తం చేశారు. రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయని వివరించారు. నాగసమందర్ దగ్గర కొత్త వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి రసమయి బాలకిషన్ స్పందిస్తూ అసంపూర్తి వంతెనలను త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. నాగసమందర్ దగ్గర కొత్త వంతెన నిర్మాణం చేపట్టుటకు పరిశీలిస్తామని పేర్కొన్నారు.