శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలి

Published: Wednesday July 13, 2022
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ,జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
      కరీంనగర్ జూలై 12 (ప్రజాపాలన ప్రతినిధి :
భారీ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న  వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.
 
    తిమ్మాపూర్ మండలంలోని మానేర్ డ్యాం లో ముంపుకు గురైన నేదునూరు గ్రామం లోని గోసంగి కాలనీలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను మంగళవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు.గత 5 రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోసంగి కులస్తుల ఇండ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఎమ్మెల్యే మరియు కలెక్టర్ వర్షంలో సైతం గొడుగులు పట్టుకొని కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పర్యటించి ప్రజల ఇబ్బందులను, పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో నివసించే వారిని వెంటనే ఖాళీ చేయించి, పాఠశాలల్లో మరియు ప్రభుత్వ భవనాలకు తరలించి, వారికి తగు నివాసాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శాశ్వత ఇండ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే రసమయి మరియు జిల్లా కలెక్టర్  స్థల పరిశీలన చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవాణి, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర ఇఫ్ఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు దుండ్ర రాజయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్,  వైస్ ఎంపీపీ వీరారెడ్డి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జ్ నాయిని వెంకట్ రెడ్డి, నాయకులు,   ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.