రాపల్లి గ్రామ ఉపాధి హామీ నివేదికను ప్రవేశపెట్టిన తనిఖీ బృందం పంచాయతీ కార్యదర్శి పై మండిపడి

Published: Monday July 25, 2022

బోనకల్, జూలై 23 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని పెద్ద ఎత్తున రాపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం లో అవినీతి అక్రమాలు జరిగినట్లు గ్రామసభలో గ్రామ తనిఖీ బృందం సభ్యులు నివేదికలను ప్రవేశపెట్టారు. మండల స్థాయి ప్రజావేదికలో కూడా సర్పంచ్ తన అవినీతి అక్రమాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయనే ఉద్దేశ్యంతో తన అనుచరులను మండల పరిషత్ కార్యాలయానికి రప్పించాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గం వారు కూడా పెద్ద ఎత్తున మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు రాపల్లి నివేదికలు ఘర్షణలు జరిగే వాతావరణ ఉండటంతో చివరన చేపట్టారు. గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించకుండా వేరొక గ్రామం నారాయణపురం గ్రామానికి చెందిన వారితో ఉపాధి హామీ పనులు చేయించినట్లు నివేదికలో గ్రామ తనిఖీ బృందం సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పిడి విద్యా చందన తీవ్రంగా స్పందించారు. ఉపాధి హామీ మరో గ్రామం కూలీలతో ఎలా చేయించారని పంచాయతీ కార్యదర్శి పై పిడి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా మరల ఇలాంటి సంఘటన జరిగితే నీపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఇతర గ్రామాల కూలీలను తీసుకువచ్చి ఉపాధి హామీ పనులు చేపిస్తుంటే పర్యవేక్షణ చేయాల్సిన మీరు ఏం చేస్తున్నారని ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవిని ప్రశ్నించారు. ఎం రాధాకృష్ణ 14 రోజులు పని చేశారని నివేదికలో ఉండగా, కానీ అతను లిఖితపూర్వకంగా నేను పనిచేయలేదని రాసిచ్చాడని నివేదిక చదివారు. కంపోస్ట్ టాస్కులు మూడు నిర్మించినట్లు బిల్లులు కూడా చెల్లించినట్లు నమోదు చేశారని,కానీ ఒక్క కంపోస్టు కూడా నిర్మించలేదని గ్రామ నివేదిక తనిఖీ బృందం తెలిపింది.16 వర్కులు పూర్తి చేసినట్లు డాక్యుమెంట్ చేశారని, కానీ ఒక్క పని కూడా చేయలేదని బృందం సభ్యులు స్పష్టం చేశారు. ఫీల్డ్ ఛానల్ ప్రతి ఛానల్ కి 0.10 ఉన్నట్లు రికార్డులో సూచించారు. కానీ ఫీల్డ్ ఛానల్ చేయలేదని తెలిపారు. రెవెన్యూ ప్లాంటేషన్ లో 21 మంది పనిచేయడం జరిగిందని, రాపల్లి గ్రామంలో కూలీలు లేక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జానకిపురం నుంచి కూలీలను తీసుకువచ్చి పని చేయించినట్లు నివేదికలో స్పష్టం చేశారు. కానీ రాపల్లి కూలీల కంటే ఎక్కువగా జానకిపురం నుంచి వచ్చిన కూలీలకు అధిక కూలీలు ఇచ్చి పని చేయించినట్లు రికార్డుల ద్వారా స్పష్టమైందని తెలిపారు. నివేదికలో49, 50, 51 అంశాలకు సంబంధించి మండల అధికారులు నివేదికలను బయటకు బహిర్గతం చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే ఈ నివేదికలను మండల అధికారులు బహిర్గతం చేయలేదని విమర్శలు ఉన్నాయి. సర్పంచ్ అధికార పార్టీ నాయకుడు కావటం వల్లే పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరగటం వల్లే ఈ అంశాల వివరాలను బయటికి వెల్లడించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రికార్డులో వర్క్ సైడ్ ఫొటోస్ చూపించలేదని తెలిపారు. చేసిన పనిని పరిశీలించి రోల్ కాల్ నిర్వహించలేదని నివేదికలో వెల్లడించారు.ఎస్టిమేట్ నందు అధికారుల సంతకాలు లేవని తెలిపారు. చేసిన పని లెక్క లేకుండా ఉన్న మస్టర్లకు వైట్ నల్ ఉపయోగించారని, ప్లాంటేషన్ లో 100 మొక్కలు వేయగా వాటిలో 46 ముక్కలు చనిపోయాయని నిర్ధారణ అయినట్లు తనిఖీ బృందం సభ్యులు తెలిపారు.19 వర్కులకు ఐడి నందు పని జరగలేదని తెలిపారు. ఇవన్నీ పరిశీలించిన పిడి మెరుగు విద్యాసంధన పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ రికార్డు ప్రకారంగా మరల అవకతవకలు ఏమైనా జరిగినచో మీరు ఉద్యోగం వదిలేసి ఇంటికి పోవలసి వస్తుందని మండిపడ్డారు. తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని సర్పంచ్ అధికారులకు చెప్పడం జరిగింది. ఎటువంటి అవకతవకలకు పాల్పడ నప్పుడు గ్రామసభ సమయంలోను మండల స్థాయిలో నిర్వహించిన ప్రజా వేదికలోనూ తన అనుచరులను ఎందుకు తీసుకువచ్చారో మండల ప్రజలలో చర్చ మొదలైంది. మండలంలో 22 మంది సర్పంచులు ఉన్నారు. 21 మంది సర్పంచులు ఒంటరిగానే ప్రజావేదికకు హాజరయ్యారు. రాపల్లి సర్పంచ్ మాత్రం తన అనుచరులతో హాజరయ్యారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. గ్రామ సభలో ప్రవేశపెట్టిన నివేదికలను కొన్నింటిని మండల ప్రజా వేదికలో ప్రవేశపెట్టకపోవడంలో ఆంతర్యమేమిటో మిస్టరీగా మారింది. మండలంలో 22 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉండగా ఏ గ్రామపంచాయతీ కార్యదర్శి పై పిడి ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక్క రాపల్లి కార్యదర్శిపై మాత్రమే ఘాటుగా స్పందించి హెచ్చరించారు. ఒకవైపు గ్రామ సభలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని గ్రామ తనిఖీ బృందం సభ్యులు స్పష్టంగా నివేదికలు ప్రవేశపెట్టారు. ప్రజా వేదికకు అందరూ సర్పంచులు లాగే రాపల్లి సర్పంచ్ రాకుండా తన అనుసర బలగాన్ని వెంట తీసుకొని రావటం పట్ల ప్రజా వేదికలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.