ధరణి పోర్టల్ లో చొరబడిన అవినీతి తిమింగలాలు

Published: Wednesday February 02, 2022
భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముడుపులు చెల్లించాలి
ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసిన కలెక్టర్
అవినీతి కలెక్టర్ తో విసిగి వేసారిన రైతులు
కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 01 ఫిబ్రవరి ప్రజాపాలన : సమగ్ర సవివరంగా భూ ప్రక్షాళన చేయకుండానే ధరణి పోర్టల్ ను ప్రవేశ పెట్టారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోపించారు. భూ సమస్యలు పరిష్కారం నిమిత్తం వచ్చే రైతులకు జిల్లా కలెక్టర్ ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాపుతుందని విమర్శించారు. రైతులు ఎలాంటి భూ సమస్యల గురించి కలెక్టర్ కార్యాలయానికి వచ్చినా భూ సమస్యనుబట్టి అనధికారికంగా నిర్ణయించిన డబ్బులు చెల్లిస్తేనే పని అవుతుందని విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చేసిన అవినీతిపై ఆరోపణలు రుజువు చేయడానికి ఒక విచారణ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. విచారణ కమిటీ కాంగ్రెస్ పార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సామాన్య రైతులు భూ పరిష్కారం నిమిత్తం వస్తే ఒక న్యాయం రాజకీయ ప్రతినిధులు చెబితే మరో న్యాయం చేయాలనే ఆలోచనతో జిల్లా కలెక్టర్ పని చేస్తున్నారని ఘాటుగా స్పందించారు. 35 శాతం మంది రైతులు భూమి తమ ఆధీనంలో ఉన్నా పూర్తి హక్కులు లేవని చెప్పారు. డిఎస్ (డిజిటల్ సంతకానికి) కూడా సరైన కారణం చూపకుండా రిజెక్ట్ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ గా విధులు చేపట్టినప్పటి నుండి ధరణిలో అవినీతి తిమింగలాలు చొరబడ్డాయని విమర్శించారు. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే వెంటనే జిల్లా కలెక్టర్ ను బదలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు జగ్గరి రత్నారెడ్డి, వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, చాపల రఘుపతి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పెండ్యాల అనంతయ్య, వెంకటేశం, అనంత్ రెడ్డి, జగ్గరి వెంకట్ రెడ్డి, చాపల శ్రీనివాస్ ముదిరాజ్, ఎర్రవల్లి జాఫర్, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.