ప్రజావ్యతిరేక విదానాల పై అఖిలపక్షం నిరసన

Published: Friday October 01, 2021
ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజాసమస్యల పై కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత.
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 30, ప్రజాపాలన : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దశల వారి ఆందోళనలో భాగంగా నాయకులు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజాసమస్యలు పై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్, న్యూ డెమోక్రసీ నాయకుడు టీ. శ్రీనివాస్, తెలంగాణ జన సమితి నాయకుడు బాబాన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించాయని ధ్వజమెత్తారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పొడు వ్యవసాయం చేసుకునే ఆడివాసులు, ఆదివాసేతరులకు పట్టాలు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని విమర్శించారు. 2006 ముందు పోడు వ్యవసాయ భూములకు పట్టాలు ఇవ్వాలి అనే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసి నూతన అటవీ చట్టం తీసుకువచ్చి పొడు వ్యవసాయదారులకు అన్యాయం తలపెడుతున్నదని మండిపడ్డారు. పోడు వ్యవసాయదారులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ దశలవారీ ఆందోళనలో భాగంగా అక్టోబర్ 5న రహదారులను దిగ్భంధిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి రాష్ట్రంలో టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో పాటు 18 పార్టీలు ఐక్య ఉద్యమాలను సాగిస్తున్నాయని వారు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పోడు వ్యవసాయ దారులు, రైతులు, ఆదివాసేతరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.