మదన్ పల్లి రచ్చబండతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్

Published: Thursday June 09, 2022
కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో జూన్ 08  ప్రజా పాలన : రైతు రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో రోజురోజుకు జోష్ పెరుగుతుందని కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆశా భావం వ్యక్తం చేశారు.  వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదన్ పల్లి గ్రామ ప్రవేశ ప్రధాన రోడ్డు మార్గంలో టపాసులు కాలుస్తూ డప్పు వాయిద్యాలతో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు జయజయ నినాదాలు పలుకుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకంలో భాగంగా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15 వేల రూపాయలు, భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాదికి 12 వేల రూపాయలు అందజేయనున్నామని వివరించారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. మూతపడిన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంట నష్టపోతే తక్షణం పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతు కూలీలు కౌలు రైతులకు రైతు భీమా పథకం వర్తించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుబంధం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ను రద్దు చేసి ధరణి స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. పోడు భూముల రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని వెల్లడించారు. నకిలీ విత్తనాలు పురుగు మందుల విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వారి ఆస్తులు జప్తు చేసి బాధ్యులపై పీడీ యాక్ట్ కేసులతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్దిష్ట ప్రణాళికతో అవినీతి రహిత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని భరోసా కల్పించారు. రైతు కమిషన్ రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారులతో ఏర్పాటు చేస్తామని వివరించారు. లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నా రెడ్డి జెడ్పీటీసీ మాజీ చైర్మన్ మైపాల్ రెడ్డి చామల రఘుపతి రెడ్డి ఎర్రవల్లి జాఫర్ కల్ఖోడ నర్సిములు సతీష్ రెడ్డి మదన్ పల్లి గ్రామస్థులు సంగయ్య మాధవరెడ్డి జగదీశ్వర్ బాలయ్య రాములు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.