జోన్ మార్చడంతో 90 శాతం ఉద్యోగస్తులకు మేలు

Published: Thursday July 29, 2021
రాష్ట్ర గ్రంథాలయాల సంస్థల అధ్యక్షుడు అయాచిత్తం శ్రీధర్
వికారాబాద్ బ్యూరో 28 ప్రజాపాలన : జోగులాంబ జోన్ నుండి వికారాబాద్ జిల్లా ను చార్మినార్ జోన్ లోనికి మార్చడం వలన 90 శాతం ఉద్యోగస్తులకు లబ్దిచేకూరనున్నదని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అయాచిత్తం శ్రీధర్ కొనియాడారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ మురళీకృష్ణ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిఎం కెసిఆర్ 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు వివరించారు. ఉద్యోగం సాధించేందుకు ఉపయోగపడే విషయ పరిజ్ఞానానికి ప్రతి గ్రంథాలయం అమ్మ ఒడిలా ఆదుకుంటుందని ప్రశంసించారు. ఉద్యోగాన్ని ఒడిసి పట్టేందుకు కావలసిన నైపుణ్య స్ఫూర్తికి కల్పతరువుగా గ్రంథాలయాలు నిలుస్తాయని గుర్తు చేశారు. ప్రతి మండల పరిధిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలు పూర్తి సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగస్తులు తమ అభిరుచికి అనుకూలమైన పుస్తకాలను గ్రంథాలయాలలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగస్తులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాంకేతిక, పోటీ పరీక్షలకు ఉపయోగపడే మెటిరియల్ ను అందజేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలలో ప్రస్తుతం 568 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక పంపించామని తెలిపారు.  వికారాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో 18 మినీ గంధాలయాలు ఉన్నాయని అన్నారు. నూతనంగా నిర్మింపబడుతున్న గ్రంథాలయంలో అన్ని మౌలిక వసతులతో పాటు విద్య, వైద్య, సాంకేతిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. గ్రంథాలయాలపై లేనిపోని అపోహలు కలిగి ఉండరాదని హితవు పలికారు. కోవిడ్ కారణంగా జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ పదవీ స్వీకార ప్రమాణం చేయలేకపోయానని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో నిర్వహించిన జాబ్ మేళాలో 350 మంది హాజరు కాగా 45 మందికి వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లభించడం విశేషమని కొనియాడారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జిల్లా గ్రంథాలయము నుండి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలను కల్పింంచుటకు కృషి చేస్తామని అన్నారు. భవిష్యత్తులో ప్రతి మండల పరిధిలోని గ్రంథాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల పరిధితో పాటు మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కొత్తగా ఏర్పడిన చౌడాపూర్ మండలంలో గ్రంథాలయాన్ని స్థాపించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.