వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి

Published: Friday February 11, 2022
వీఆర్ఏల సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మన్ వంగూరు రాములు
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం చేస్తూ విఆర్ఎలందరికీ పే స్కేల్ అమలు చేస్తానని ఇచ్చిన హామీని వెంటనే జీవో ఇచ్చి అమలు చేయాలని లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మన్ వంగూరు రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం వీఆర్ఏ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు వికారాబాద్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కెసిఆర్ నిండు అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడంలో గత18 నెలలుగా నాన్చివేత ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. వీఆర్ఏలు అందరూ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని తరతరాలుగా ఆ వ్యవస్థలో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని వారికి న్యాయం చేసే విధంగా 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వీఆర్ఏ లలో అనేకమంది డిగ్రీలు పీజీలు చదువుకొని పనిచేస్తున్నారని అందరికీ రెవెన్యూ వ్యవస్థ ఖాళీ పోస్టులలో ప్రమోషన్ ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రెవెన్యూ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని అందులో భాగంగానే రెవెన్యూ మంత్రి సిసిఎల్ఎ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, డైలీ వేజ్, పార్ట్ టైం ఫుల్ టైం మరియు ఆశ అంగన్వాడి ఉద్యోగులందరికీ పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచిందని మరి వీఆర్ఏలు ఏం పాపం చేశారని పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈనెల 22న చలో హైదరాబాద్ తర్వాత నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ తుమ్మల వీరారెడ్డి, రెండు వీఆర్ఏల సంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మొసంగి అంజయ్య గన్నెబోయిన శ్రీనివాస్, గంటెకంపు శ్రీనివాస్, వంటెపాక రాంబాబు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సంఘం రాష్ట్ర నాయకులు ఎల్ నరసింహారావు, టి సాల్మన్, రామచంద్రయ్య, జ్యోతి, యాదయ్య, నార్ల శ్రీనివాస్, వీరయ్య బుచ్చయ్య, జగన్ మృదుల, ఎలమంద తదితరులు పాల్గొన్నారు.