కాసుల పై ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాల పై లేదు.

Published: Tuesday March 15, 2022
నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.
రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్
మంచిర్యాల టౌన్, మార్చి14, ప్రజాపాలన: కాసుల పై ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాల పై లేదని, మంచిర్యాల జిల్లాలో చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదని రైట్ టు హెల్త్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. నిబంధనలు ఉల్లంఘిస్తున్న చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఆసుపత్రుల ఉదాసీనత వలన రోగులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే హాస్పిటల్స్ నడుస్తున్నాయన్నారు. నిబంధనల ప్రకారం ఆస్పత్రులకు 15 మీటర్ల ఎత్తుతో ఐదువందల చదరపు మీటర్ల వైశాల్యంలో భవనాలు నిర్మించాలని, పూర్తిస్థాయిలో నీటి వసతి ఉండాలని, చుట్టూ అంబులెన్సులు, అగ్నిమాపక వాహనం తిరిగ గలిగే విధంగా స్థలం ఉండాలన్నారు. కానీ భవనం లోపల ర్యాంపులతో పాటు, మెట్ల దారి ఉండాలని, గాలి, వెలుతురు ధారాళంగా లొపలికి రావాలంటూ ఎన్నో నిబంధనలు ఉన్నా, ర్యాంపులు మెట్లదారి మినహా మిగతావేవి అమలు కావడం లేదన్నారు. ఆసుపత్రులకు కాసుల పై ఉన్న శ్రద్ధ కనీస సౌకర్యాల పై లేదన్నారు.ఇట్టి ప్రైవేట్ ఆసుపత్రుల పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడెంకి చందు, జంబోది శ్రీనివాస్, చిట్టుమల్ల నరేందర్, కల్వచర్ల నాగభూషణం చారి తదితరులు పాల్గొన్నారు.