పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి

Published: Saturday April 01, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 31 మార్చి ప్రజాపాలన :  గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లయితే పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.
శుక్రవారం నవాబ్ పేట  మండలం చించల్ పేట, గంగ్యాడ గ్రామాలలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను, పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా  తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన గంగ్యాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు పల్లె దవఖాన, అంగన్వాడి కేంద్రము, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చదువు ఆయుధం లాంటిదని ప్రతి విద్యార్థి బాగా చదువుకొని తమ తలరాతలు మార్చుకోవాలన్నారు. జీవితంలో అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా కష్టపడి బాగా చదవాలన్నారు.  కష్టపడి చదివితే వంద శాంతం విజయం సాధించవచ్చున్నారు. పదవ తరగతిలో 10/10 సాధించే ఒక విద్యార్ధికి గ్రామ సర్పంచ్ పదివేల  రూపాయలు బహుమతిగా అందిస్తానని ప్రకటించగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, పాఠశాలలో పది పాయింట్లు సాధించిన వారందరికీ రూ. పదివేల చొప్పున ప్రోత్సాహకం  అందిస్తానని ప్రకటించారు.  ఫలితాలు వచ్చిన తర్వాత పాఠశాలకు తిరిగి వస్తానని కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు.  పాఠశాల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  విద్యార్థులు పాఠశాలకు రాకుంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియపరచాలని, వారి ఇండ్లకు వెళ్లి తీసుకొని రావాలన్నారు.  పాఠశాలలో వంద శాతం ఫలితాలు కన్నా, క్వాలిటీగా విద్యను అందించిన తర్వాత ఫలితాలు ఎంత వచ్చినా పర్వాలేదు అన్నారు.  క్వాలిటీ విద్య విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన కలెక్టర్ రెండవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. వారి విద్యాసామర్ధ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు.  హాజరు శాతం తక్కువగా ఉండడంతో, విద్యార్థులు పాఠశాలకు ఎందుకు రావడం లేదని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.  ప్రతివారం పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వచ్చేటట్లు చూడాలన్నారు.  విద్యార్థులు సరిగా పాఠశాలకు రాకుంటే మూసివేసే పరిస్థితి ఎదురవుతుందన్నారు.  మధ్యాహ్నం భోజనం క్వాలిటీగా
 లేదని, ప్రధానోపాధ్యాయుడు ఉమా మహేశ్వర రావుకు మెమో జారీ చేయాలని సూచించారు. అక్కడే ఉన్న పల్లె దవఖాన, అంగన్వాడి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా దవఖానాలో చికిత్సలు పొందుతున్న గర్భిణీల వివరాల రిజిస్టర్ లను పరిశీలించారు.  గ్రామంలోని కొంతమంది గర్భిణీలు సక్రమంగా చికిత్సకు రావడం లేదని తెలుసుకొని అట్టి ఇద్దరు  గర్భిణీలతో స్వయంగా ఫోన్ ద్వారా మాట్లాడి విషయాలు అడుగగా, వారు మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో మెరుగైన వైద్య చికిత్సలు పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, వంద శాంతం సాధారణ కాన్పులు చేపట్టడం జరుగుతుందని, నాణ్యమైన మందులు కూడా అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రసవం తర్వాత సక్రమంగా టీకాలు వేయించుకోవాలని మహిళలకు సూచించారు.  గ్రామాలలో గర్భిణీలు, మహిళల ఆరోగ్యం పట్ల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.  ప్రభుత్వం అందించే మందులు నాణ్యమైనవని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఏఎన్ఎం లు, ఆశాలు, ప్రతిరోజు ఉదయం ఒక గంట సమయం కేటాయించి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను పరిశీలించాలని సూచించారు. గ్రామాలలో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారులతో మంచి సేవలు అందిస్తుంది, ఆసుపత్రులు, పాఠశాలలను  సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.  గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలకు రావాలని, ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు బాగా చదువుకొని పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై వచ్చిన వారిని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం,  హరితహారం నర్సరీ, క్రీడా ప్రాంగణాలను కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో పచ్చదనం, పారిశుద్యం బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు ట్యాంకర్లను అందజేసిందని తెలియజేశారు.  ప్రజలకు అవగాహన కల్పించి, చెత్తను రోడ్లపై పడకుండా చూడాలన్నారు.  ప్రతిరోజు తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి సెగ్రిగేషన్ పనులు చేపట్టాలని సూచించారు.  గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ సరిగా లేనందున కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వచ్చే జూన్ మాసంలో పెద్ద మొత్తంలో అవెన్యూ ప్లాంటేషన్  చేపట్టాలని ఆదేశించారు.  ప్రతి గ్రామంలో కనీసం రెండు కిలోమీటర్ల ఫార్మేషన్ రోడ్లను ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కార్మికులతో తప్పకుండా చేపట్టాలని.  పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం  బాగుందని కలెక్టర్ ప్రశంసించారు. అంతకుముందు చింతల్ పేట గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను, గంగ్యాడ గ్రామంలో చేపడుతున్న చెక్ డ్యామ్ పనులను సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.  చింతల్ పేట బ్రిడ్జి నిర్మాణంలో ఇద్దరు రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమి కోల్పోతున్నందు వారితో మాట్లాడి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించడం జరుగుతుందని, పనులకు అంతరాయం కలగకుండా సమస్యను కలెక్టర్ పరిష్కరించారు.  చెక్ డ్యామ్ పనులను మే మాసంలో పూర్తి కావాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, ఇరిగేషన్ ఇఇ సుందర్, నవాబ్ పేట  తహసిల్దార్ రవీందర్, ఎంపీడీవో సుమిత్ర, ఎంపీపీ భవాని, జడ్పిటిసి జయమ్మ, సర్పంచ్ గోవిందమ్మ, ఎంపీఓ విజయ్ కుమార్, గ్రామ కార్యదర్శి రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.