విద్యుత్ కోతలతో ఎస్టీ కాలనీ వాసుల కష్టాలు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారుల

Published: Monday August 22, 2022

బోనకల్, ఆగస్టు 21 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో స్థానిక గిరిజన కాలనీలో కరెంటు కోతలతో సతమతమవుతున్నామని గిరిజన కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు లబోదిబో మంటున్నారు. ప్రతిరోజు రాత్రి సమయంలో కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందని తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క  కరెంటు కోతల వల్ల దోమల బెడదతో చిన్నపిల్లలు నిద్ర పోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ప్రతిరోజు విద్యుత్ సమస్యలతో ఎస్టి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ విషయంపై గత 5,6 సంవత్సరాల నుండి  విద్యుత్‌ శాఖ అధికారులను సంప్రదించగా, అధికారులు మారుతున్నారు గాని కాలనీ వాసుల కరెంటు కష్టాలు తీర్చలేక పోతున్నారు. కరెంటు కష్టాల గురించి అధికారులకు తెలియజేస్తే మాకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రంలో గిరిజన కాలనీలో ప్రతిరోజు విద్యుత్‌ కోతలు సర్వసాధారణమై పోయాయి. గిరిజనులు అంటే విద్యుత్ అధికారులకు ఇంత చులకన, ఎన్నిసార్లు విన్నవించిన  విద్యుత్ సమస్యలపై మా  బాధలు ఆలకించర అంటూ కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఎన్ని రోజులు మాకు ఈ కరెంటు కష్టాలు, పట్టించుకునే వారు లేరా అంటూ గిరిజన కాలనీవాసుల అవస్థలు, విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేక గిరిజన కాలనీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 3 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి సమయంలో విద్యుత్ కోతలతో ప్రజలు సతమతమవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. కరెంటు లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో నానా అవస్థలు పడు తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు వేసవికాలం వస్తే ఇంకెన్ని ఇబ్బందులు పడాలో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన  పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఒక పక్క దోమల బెడద,  మరోపక్క ఉక్క పూతతో  కరెంటు లేక నరకం చూస్తున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో ఇటువంటి విద్యుత్ సమస్యలు, విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.