విద్యార్థుల మరణాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

Published: Friday September 09, 2022
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఆర్వో కు వినతి **
 
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 8 (ప్రజాపాలన, ప్రతినిధి) : విద్యార్థుల మరణాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కుటుంబాలకు న్యాయం చేయాలని గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఆర్ఓ కదం సురేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, జిల్లా అధ్యక్షుడు బొర్కుటే శ్యామ్ రావు, టీకానంద్ లు, మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా  గడిచిన 12 రోజుల వ్యవధిలో వసతి గృహాలలో 5గురు విద్యార్థులు మృతి చెందారని అన్నారు. ఆగస్టు 25న పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థి రాజేష్ (15) రక్తహీనత, జ్వరంతో మృతి చెందాడని, ఆగస్టు 28న  సిర్పూర్ టి గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని అశ్విని 12 జ్వరంతో మృతి చెందిందని, ఆగస్టు 29న తిర్యాని మండలంలోని ఆశ్రమ పాఠశాలకు చెందిన టెకం రమేష్ 12, 5వ తరగతి విద్యార్థి జ్వరంతో మృతిచెందాడని, ఆగస్టు 31న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  సంగీత 19, జ్వరంతో మృతి చెందిందని అన్నారు. ఈ మరణాలను జీర్ణించుకోక ముందే కాగజ్నగర్ కస్తూరిబా లో సెప్టెంబర్ 7న 8వ తరగతి విద్యార్థిని ఐశ్వర్య 13, బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందిందని అన్నారు. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వలన విద్యార్థిని విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ, గురుకులాలలో విధులు నిర్వహిస్తున్న జిల్లా అధికారులు డి డి, డి పి డి ఓ, డి ఈ ఓ, ఆర్ సి ఓ, పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. హెచ్ఎం, హెచ్ డబ్ల్యూ, ఎస్ ఓ, ప్రిన్సిపాళ్ల చలామణి ఎక్కువ కావడంతోనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం నిర్వహిస్తున్నారని, ఈ ఐదుగురు విద్యార్థుల మరణాలకు కారకులైన వీరిని విధుల నుండి తొలగించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మరణించిన విద్యార్థులకు కుటుంబాలకు రూ 15 లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. జిల్లాలో విద్యార్థుల మరణాలు పునరావృతం కాకుండా ప్రతి హాస్టల్ లో మెడికల్ క్యాంపు, నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
 
 
 
Attachments area