ప్రశాంతంగా ముగిసిన టి. ఎస్. పి. ఎస్. సి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జిల్లా కలెక్టర్ భారతి హో

Published: Monday October 17, 2022
మంచిర్యాల బ్యూరో,  అక్టోబర్ 16, ప్రజాపాలన:
 
 
 తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నిర్వహించిన టి. ఎస్. పి. ఎస్. సి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో అధికారుల సమన్వయంతో సజావుగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆదివారం పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లాలోని మంచిర్యాలలోని డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, బెల్లంపల్లి లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, టి. ఎస్. డబ్ల్యు.ఆర్.ఎస్./జె. సి. ( బాలికలు), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9 వేల 243 మంది అభ్యర్థుల కొరకు 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 27 మంది ముఖ్య పర్యవేక్షక అధికారులు, 8 మంది లైసెన్, 27 మంది సహాయ లైసన్ అధికారులు, 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 19 మంది పి. హెచ్. స్క్రిబ్ లను నియమించడం జరిగిందని, సి. సి. కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పత్రాలు, ఓ. ఎమ్. ఆర్. పత్రాల పంపిణీ, పరీక్షల నిర్వహణ జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సరఫరా తదితర సౌకర్యాల ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా బస్సులు నడిపించడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులతో ఎలక్ట్రానిక్ పరికరాలు, రైటింగ్ ప్యాడ్స్, బూట్లు లాంటి వాటిని అనుమతించకుండా టి. ఎస్. పి. ఎస్. సి. నియమ నిబంధనల మేరకు బయోమెట్రిక్ పద్ధతిన హాజరు తీసుకొని పరీక్ష హాలు లోనికి పంపించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 9 వేల 243 మంది అభ్యర్థులకు గాను 1 వేయి 984 మంది గైర్హాజరు కాగా 78.54 శాతంతో 7 వేల 259 అభ్యర్థులు పరీక్షలకు హాజరు అయ్యారని తెలిపారు.
 
టి. ఎస్. పి. ఎస్. సి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల రాజస్వ మండల అధికారి వేణు తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలు సజావుగా నిర్వహించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 
ఈ కార్యక్రమాలలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.