ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Published: Tuesday February 01, 2022

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

జగిత్యాల, జనవరి, 31 (ప్రజాపాలన ప్రతినిధి): మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలను ఇంకా బలోపేతం చేస్తామని జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్ టియుటిఎస్ జిల్లా శాఖ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే క్వార్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 7289.54 కోట్లతో రాష్ట్రంలోని మొత్తం 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా బలోపేతానికి పూనుకుందని అన్నారు. ప్రభుత్వం మరియు సమాజ  సహకారంతో పూర్తిస్థాయిలో సకల సదుపాయాలు, వసతులు కల్పించనున్నట్లు, అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సంధర్భంగా ఎస్ టియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, మచ్చ శంకర్ మాట్లాడుతూ జీవో 317 అమలులో జరిగిన లోటుపాట్లను సవరించాలని,  ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని, వేసవి సెలవుల్లో బదిలీలు పదోన్నతులు చేపట్టాలని, ప్రతి పాఠశాలలో స్కావెంజర్స్ నియమించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అన్ని సమస్యలు ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని, విద్యాభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాజోజీ భూమయ్య, రాష్ట్ర కార్యదర్శి కచ్చు రాజన్న, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్ వివిధ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు జిల్లా బాద్యులు, రత్నాకర్, కిరణ్, శివరామకృష్ణ, వెంకటేష్, రాజేశ్వర్, కృష్ణ, రాజ్ కిరణ్, రవీందర్, దశరథ రెడ్డి, నంద్యానాయక్, తదితరులు పాల్గొన్నారు.