వెల్చాల్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం

Published: Thursday March 02, 2023
* ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు
వికారాబాద్ బ్యూరో 01 మార్చి ప్రజాపాలన : అద్భుత గుహాలయం. ఆధ్యాత్మిక నిలయం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రం. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన అనంతగిరి పర్వత శ్రేణి ఉత్తర కోశాన వెలసింది. ఈ దివ్య క్షేత్రం ఎత్తైన కొండ గుహలో పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన నీటితో నిండి ఉండే గుండం ఇచ్చట ప్రత్యేకత. అజంతా గుహలను పోలిన అద్భుత గుహాలయం. తెలంగాణ అజంతాగా కీర్తి ప్రతిష్టలు పొందినది. ఒక సాధారణ మనిషి కేవలం ఒక గొడ్డలినే పనిముట్టుగా వారి గుట్టను గుహగా గుడిగా మార్చిన మహనీయుడు పరమయ్య స్వామి. 1960 సంవత్సరంలో వెలుగులోకి వచ్చి గ్రామస్తుల సహకారంతో దాతల సహాయముతో దినదినాభివృద్ధి చెందుతున్నది. స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రతి సంవత్సరం నిర్వహించు జాతర ఉత్సవంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి తరిస్తారు. గ్రహదోషాలకు కుజ రాహు శని కేతు కాలసర్ప మొదలగు వాటికి శాంతి పూజ సౌకర్యం కలదు. భక్తులకు నివాసం ఉండడానికి వసతి సౌకర్యం ఏర్పాటు కలదు.
** జాతర కార్యక్రమం వివరాలు : 
స్వస్తిశ్రీ చంద్రమాన శుభకృత్ నామ సంవత్సర పాల్గుణ శుద్ధ దశమి 2023 మార్చి ఒకటి బుధవారం నుండి శుద్ధ ఏకాదశి 2023 మార్చి 3 శుక్రవారం వరకు  జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తెలిపారు. మార్చి 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం సాయంత్రం ఐదు గంటలకు బోనాలు రాత్రి 10 గంటలకు పల్లకి సేవ భజన కార్యక్రమం మార్చి రెండవ తేదీ గురువారం రాత్రి 10 గంటలకు స్వామివారి రథోత్సవం భజన కార్యక్రమం మార్చి 3వ తేదీ శుక్రవారం 11.35 గం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు పెరుగు వసంతం జాతర ముగింపు రాత్రి బట్ట బృందం చే భజన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తెలిపారు.