సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్

Published: Thursday November 10, 2022
బోనకల్, నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి: పారిశుధ్యం పై ప్రజలు నిర్లక్ష్యం వహించ వద్దు అని మండల పరిషత్ అభివృద్ధి అధికారి బోడేపూడి వేణుమాధవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చిన్న బీరవల్లి, మోటమర్రి, గార్లపాడు గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు. చిన్న బీరవల్లి గ్రామంలో ప్రజల కోసం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోని అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన అంటు వ్యాధులు తమ దరికి చేరవని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎవరికైనా అనారోగ్యం కలిగితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వెళ్లి వైద్యులను సంప్రదించి అందుకు తగిన మందులు ఉచితంగా తీసుకుని వాడాలని సూచించారు. మోటమర్రి ,గార్లపాడు, చిన్నబీరవల్లి గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మోటమర్రి సర్పంచ్ కేతినేని ఇందు, పలువురు ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.