హిందూ ఏక్తా యాత్రకు ముస్తాబైన కరీంనగర్ -కూడళ్లన్నీ కాషాయమయం.... నగరమంతా శోభాయమానం... -రాజకీయాలక

Published: Wednesday May 25, 2022
కరీంనగర్ మే 24 ప్రజాపాలన ప్రతినిధి :
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. అందుకోసం కరీంనగర్ అందంగా ముస్తాబైంది. నగర వీధులన్నీ కాషాయ వర్ణమయ్యాయి. ఏక్తా యాత్ర ఊరేగింపు కోసం శ్రీరామ చంద్రుడి విగ్రహాలు, హనుమంతుడి విగ్రహాలు అందంగా రూపుదిద్దుకున్నాయి. నగరానికి చేరుకున్నాయి. కేరళ వాయిద్యాలు... భక్తి పాటలు... ధార్మిక ప్రసంగాలు... హైందవ గొప్పతనాన్ని చాటేలా ఊరేగింపులతో కరీంనగర్ లో నిర్వహించబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’ రాష్ట్రంలోనే హైలైట్ గా నిలవబోతోంది. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం అనంతరం నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు కనీవినీ ఎరగని రీతిలో వేలాదిగా జనం తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున హిందూ భక్తులు, యువకులు తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హిందూ ధార్మిక సంఘాలు, హైందవ సంస్ర్కుతిని చాటే సంస్థల ప్రతినిధులు కూడా ఈ యాత్రకు విచ్చేయనున్నారు. స్వరాష్ట్రం నుండే కాకుండా విదేశాల నుండి కూడా కేవలం ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనేందుకు వస్తుండటం విశేషం. 
రేపు సాయంత్రం 4 గంటలకు యాత్ర షురూ...
గురువారం నాజు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ పట్టణంలోని వైశ్యా భవన్ నుండి ‘హిందూ ఏక్తా యాత్ర’ ప్రారంభం కానుంది.  సాధు పరిషత్ అధక్ష్యులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామిజీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాత్ర ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా యాత్రకు హాజరయ్యే వేలాది మంది యువకులు, భక్తులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. 
ఏక్తా యాత్ర సాగే రూట్ మ్యాప్ ఇదే...
అనంతరం వేలాది జన సందోహంతో కలిసి ‘హిందూ ఏక్తా యాత్ర’ వైశ్య భవన్ నుండి ప్రారంభమవుతుంది. రాజీవ్ చౌక్-టవర్ సర్కిల్-ప్రకాశం గంజ్-శాస్త్రీ రోడ్-భారత్ టాకీస్-కమాన్ చౌరస్తా-బస్టాండ్-తెలంగాణ చౌక్-ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్-కోర్టు చౌరస్తా- మంచిర్యాల చౌరస్తా-గాంధీ రోడ్ మీదుగా వైశ్యా భవన్ వరకు కొనసాగనుంది.
శ్రీరామ నామస్మరణతో మారుమోగనున్న కరినగరం
దారి పొడవునా మహిళల మంగళహారతులు, కేరళ వాయిద్యాలు, భక్తి పాటలు, జై శ్రీరాం.. జై హనుమాన్ నామస్మరణలతో కరీంనగర్ యావత్తు పులకించనుంది. యువకుల కేరింతలు, మహిళల కోలాటాలు... భక్తుల దైవ నామస్మరణలు, దేవుడి వేషధారణలతో కరీంనగర్ మారుమోగనుంది. ఈ మహత్తర ఘట్టాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు టీవీల్లో, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికగా వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హిందువుల సంఘటిత శక్తిని, సంస్క్రుతిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా చేపట్టనున్న ‘హిందూ ఏక్తా యాత్ర’ ద్వారా కరీంనగర్ మరోసారి యావత్ తెలంగాణ ప్రజల ద్రుష్టిని ఆకర్షించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 
హిందూ బంధువులారా.... తరలిరండి
కరీంనగర్ లో చేపడుతున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు హిందూ బంధువులంతా తరలివచ్చి హిందువుల సంఘటిత శక్తిని, ఐక్యతా స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కుహాన లౌకిక శక్తులు, పార్టీలు హిందువుల ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని... ఈ తరుణంలో హిందువులంతా ఐక్యంగా ఉన్నారనే సంకేతాలను పంపేందుకు, హిందూ శక్తిని ప్రదర్శించేందుకే ‘హిందూ ఏక్తా యాత్ర’కు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.