పరీక్షల నిర్వహణ చేతగాని ప్రభుత్వం

Published: Wednesday April 05, 2023
* బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు విజయరాజ్ ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన : ఏడాది కాలంగా చదివిన చదువులకు వార్షిక పరీక్షలే కొలమానమని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు విజయరాజ్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం ఆయన ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి అనుభవించిన కష్టాలను తమ సంతానం అనుభవించరాదనే ఉద్దేశంతో రాత్రింబగళ్లు కష్టపడి తమ పిల్లల్ని చదివిస్తున్నారని స్పష్టం చేశారు. పాఠశాలలో చెప్పిన పాఠాలకు అనుగుణంగా ప్రైవేటుగా కూడా ప్రత్యేక శిక్షణ తమ పిల్లలకు ఇప్పిస్తారని తెలిపారు. వార్షిక పరీక్షలలో తమ పిల్లలు మంచి గ్రేడుతో పాస్ అవ్వాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారని వివరించారు. తల్లిదండ్రుల ఆశలను ఆశయాలను బిఆర్ఎస్ ప్రభుత్వం సంబంధిత అధికారులు ప్రశ్న పత్రాల లీకేజీ తో నీరు గారుస్తున్నాయని ఘాటుగా స్పందించారు. పరీక్ష కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యమైతే ఏ విద్యార్థినిని కూడా పరీక్ష హాలు లోనికి అనుమతించని అధికారులు,  ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో తమకు తామే సాటి అనే విధంగా నిరూపించుకుంటున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాల్సిన ఉపాధ్యాయులే అడ్డదారి తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని వైఖరితో విద్యా వ్యవస్థను భ్రస్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఎంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్న ఉపాధ్యాయులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదని డిమాండ్ చేశారు. నిరుద్యోగార్తుల కల్పతరువైన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లో కూడా ప్రశ్న పత్రాలను లీకేజీ చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం చేతగానితనాన్ని రుజువు చేస్తుందన్నారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించని ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా నమ్ముతారని నిలదీశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థనే సర్వనాశనం చేసిన ఘనమైన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిరకాలంగా గుర్తుంటుందని అన్నారు.