వికశించిన కొటాలగూడ విద్యా కుసుమం

Published: Monday October 25, 2021
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుబండిని లాగుతున్న తల్లిదండ్రులు ఎల్లన్నోల్ల బందెమ్మ మాణయ్య
పేదింటి వ్యవసాయ కుటుంబమైనా చదువుల తల్లకి నిలయం
ఎల్లన్నోల్ల శిరీష ఎంఎస్సీ ఎంట్రెన్స్ ఫలితాలలో రాష్ట్ర 3వ ర్యాంకు విజేత
వికారాబాద్ బ్యూరో 24 అక్టోబర్ ప్రజాపాలన : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే చదువుల తల్లి కరుణించి ఆశీర్వదిస్తుంది. వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామానికి చెందిన ఎల్లన్నోల్ల శిరీష రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంఎస్సి (గణితం) ఎంట్రెన్స్ ఫలితాలలో 3వ ర్యాంకు సాధించి విజయకేతనం ఎగురవేసింది. వికారాబాద్ ఎంపిడిఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ చెన్నారెడ్డి, కొటాలగూడ గ్రామ సర్పంచ్ రాములు నాయక్, ప్రధానోపాధ్యాయులు విఠల్ రెడ్డి, ఉప సర్పంచ్ హన్మంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమాదేవి ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే విధంగా చదువు పట్ల ఆసక్తిని పెంచుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించడం విశేషం. వ్యవసాయ పనులలో తల్లిదండ్రులకు తన సెలవు దినాలలో చేదోడువాదోడుగా నిలిచింది. పేదరికం కుటుంబం పోషించుకోడానికే కానీ చదువుకు కాదని నిరూపించింది. పట్టువదలని విక్రమార్కుడిలా రాత్రింబగళ్ళు శ్రమించి లక్ష్యాన్ని అధిగమించింది. లక్ష్యాన్ని ఒడిసి పట్టుకోడానికి కఠోర శ్రమనే ఎంచుకుంది. రెక్కలు ముక్కలు చేసుకునే కష్టజీవుల ఇంట పుట్టడం ఒక ఎత్తైతే వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కేలా కృషి చేయడం మరో ఎత్తు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకొని బతుకుబండిని లాగుతున్న తల్లిదండ్రులను ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. తల్లిదండ్రులు అనుభవించిన కష్టాలను తమ సంతానం పడకూడదనే ఉద్దేశ్యంతో కలోగంజి తాగి చదివించాలనే దృఢ సంకల్పం గొప్పది. కొటాలగూడ గ్రామం గ్రామీణ ప్రాంతమైనా చదువులో ఎల్లన్నోల్ల శిరీష అగ్రగణ్యురాలిగా రాణించింది. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు చిన్నప్పటి నుండే చదువులో ఆసక్తిని పెంచుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎంఎస్సీ (గణితం) ఎంట్రెన్స్ లో టాప్ త్రీ ర్యాంకు సాధించి అందరిచేత మన్ననలను పొంది రాబోవు తరానికి గమ్యం చూపింది. తనను కన్న తల్లిదండ్రులకు, విద్యాబుద్దులు నేర్పిన గురువులకు, తన గ్రామానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పతాక స్థాయిలో నిలపడం అభినందనీయం. కొటాలగూడ గ్రామం వైపు అందరి చూపు మళ్ళే విధంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఎల్లన్నోల్ల శిరీష ఉన్నత పదవులను పొందాలని ఆశిద్దాం. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కొటాలగూడలోని ప్రైమరీ పాఠశాలలో చదివింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సిద్దులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివింది. ఇంటర్మీడియట్ సిద్ధార్థ జూనియర్ కళాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో చదివిన కొటాలగూడ గ్రామీణ విద్యా కుసుమం. రాష్ట్ర వ్యాప్త ఎంఎస్సీ ఎంట్రెన్స్ కు పక్కా ప్రణాళిక బద్ధంగా గణిత విషయ నిపుడైన రత్నాకర్ వద్ద తగు శిక్షణ పొందింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే చదువు పట్ల ఆసక్తి, ఏకాగ్రత, లఘు ప్రశ్నలకు సమయ స్ఫూర్తిగా జవాబులను రాయడం, విషయ పరిజ్ఞానాన్ని శీఘ్రంగా పెంచుకోవడం వంటి విషయాలలో ముందు వరుసలో నిలిచింది. కొటాలగూడ గ్రామ సర్పంచ్ రాములు నాయక్ మాట్లాడుతూ..ఎల్లన్నోల్ల బందెమ్మ మాణయ్యలకు నలుగురు సంతానం. కుమార్ బిఎ బిఎడ్, పావని 7వ తరగతి, అనిత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, నాల్గవ సంతానమే శిరీష. నలుగురిలో ముగ్గురు ఉన్నత చదువులు చదివిన వారే. బాగా చదువుకోవాలనే లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని శిరీష నిరూపించింది. ప్రైవేట్, కార్పోరేట్ విద్యాలయాలలో లభించే విద్య కంటే ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రతి తల్లిదండ్రికి కనువిప్పు కలిగించింది. కొటాలగూడ గ్రామ విద్యార్థులు అందరూ శిరీషను ఆదర్శంగా తీసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మనస్సుంటే మార్గం ఉంటుంది. పేదరికం చదువుకు ఆటంకం కారాదని ఆశిద్దాం.