వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షణే లక్ష్యం

Published: Tuesday April 26, 2022
వక్ఫ్ భూములు అమ్మ వద్దు కొన వద్దు
వికారాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు ఎజాస్ ఆఫ్రిది
వికారాబాద్ బ్యూరో 25 ఏప్రిల్ ప్రజాపాలన : వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వికారాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యులు ఎజాస్ ఆఫ్రిది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ ఆస్తులను కాపాడుతమని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా మైనారిటీ స్మశాన వాటికల్లో డబ్బులు వసూలు చేయరాదు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బోర్డు ఆస్తులను కాపాడడానికి ఆక్రమణదారులపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కొందరు మస్జిద్, దర్గాల భూమినీ తమ సొంత భూమిలా ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. ఇది ఎప్పటికీ వక్ఫ్ ఆస్తులేనని వెల్లడించారు. జిల్లాలో వక్ఫ్ ఆస్తులు 2,170 ఎకరాల భూమి ఉన్నదని వివరించారు. ఇవి చాలావరకు కబ్జాలు, అమ్మకాలతో వేలాది ఎకరాలు హరించుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తులు అల్లా పేరిట పూర్వం చక్రవర్తులు, రాజులు, నవాబులు దానం యిచ్చిన భూములు అని గుర్తు చేశారు. పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఈ భూములపై వచ్చే ఆదాయం వాడాలని వక్ప్ బోర్డు చట్టం చెబుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాతలు యిచ్చిన ఈ భూములన్నీ అమ్మే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. కానీ కొందరు ముతావల్లీలు సైతం వక్ఫ్ ఆస్తుల అక్రమ వ్యాపారానికి, కబ్జాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అని అన్నారు. కోట్లాది రూపాయల వక్ఫ్‌ బోర్డు భూములు కబ్జా దారుల కోరల్లో చిక్కి అన్యాక్రాంతమవుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కంచే చేను మేసిన చందంగా సంస్థ ఆస్తులకు కాపలా ఉండాల్సిన కొందరు మసీదుల అధ్యక్షులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మరికొంతమంది అధికారులతో కలిసి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ- జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ చేయబడిన ఆస్తులు సరియైన విధానంతో నడుస్తున్నాయా లేదా, విధి విధానాలను అనుసరిస్తున్నాయా లేదా, అని పర్యవేక్షిస్తుంది. వక్ఫ్ ప్రతిఫలాలు వాటి హక్కుదారులకు చేరుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంది. తగు రికార్డులను వక్ఫ్  గైజిట్ బుక్ లో ఉంచుతుంది. వక్ఫ్ మూలాలు, ఆదాయం, ఉద్ద్యేశాలు, హక్కుదారులు మొదలగు వాటి గూర్చి ఈ రికార్డులలో పొందుపరుస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఎవరైనా వక్ఫ్ భూములను కబ్జాచేసి అమ్మితే వారి పై క్రిమినల్ కేసు- చట్ట రీత్యాచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వక్ఫ్ ఆస్తులు కబ్జాకు గురైనట్లు ఎవరైనా జిల్లా కలెక్టర్ కు ఫీర్యాదు చేయవచ్చని అన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబందించిన భూములను ఎవ్వరూ అమ్మొద్దు- కొనొద్దు తరువాత ఇబ్బందిపడుతారని పేర్కొన్నారు. ఎవరైన ఇలా చెస్తే మా దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.