పార్టీ పటిష్ఠతే ప్రధాన లక్యంగా కృషి

Published: Tuesday July 20, 2021
ఎమ్మెల్యే ప్రోద్బలమే శ్రీరామ రక్ష
ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు
46 లక్షల మండల పార్కును రావులపల్లికి తరలింపు
మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి
వికారాబాద్ 19 జూలై ప్రజాపాలన బ్యూరో : పట్టుదల ఉంటే సాధించలేని పని ఉండదు. కార్యసాధకుడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకంజ వేయడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు విశ్రమించడు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు ముఖ్య అనుచరుడు. మర్పల్లి మండలంలో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు హద్దులు దాటింది. రెండు వర్గాలుగా ఏర్పడి పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రయత్నాలు కోకొల్లలు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్య నాయకుల సభా వేదిక ముందే రసాభాస సృష్టించారు. మర్పల్లి మండలంలోనే పార్టీ అంతర్గత వైరి వర్గం ఆధిపత్యం కొరకు అర్రులు చాస్తున్నది. పార్టీ అంతర వైరి వర్గానికి ఎలాగైన కళ్ళెం వేయాలనే ఆలోచనలో పుట్టినదే మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి. జిల్లా పరిధిలోని వికారాబాద్ నియోజక వర్గానికి చెందిన రావులపల్లి గ్రామం వ్యక్తే నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి. ఇతని తల్లిదండ్రులు నాదిరీగ కమలమ్మ నాదిరీగ రాంరెడ్డిలు రాజకీయంలో చురుకైన పాత్ర పోషించారు. నాదిరీగ కమలమ్మ 2014లో రావులపల్లి గ్రామ సర్పంచుగా కొనసాగారు. రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి అంచెలంచెలుగా రాజకీయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎమ్మెల్యే అభిమానాన్ని సంపాదించాడు. 2019లో మర్పల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికవడానికి ఎమ్మెల్యే సహకారం తోడ్పడింది. అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుండి పార్టీ అంతర్గత పోరును రూపుమాపుటకు విశేష కృషి చేశాడు. పార్టీ అంతర్గత వైరి వర్గానికి జోడు పదవులను తొలగించడంలో సఫలీకృతుడయ్యాడు. మండల పరిధిలోని సర్పంచులను ఏకతాటిపైకి తెచ్చి బిల్కల్ గ్రామానికి 3 సార్లు సర్పంచుగా ఎన్నికైన శ్రీనివాస్ ను సర్పంచుల సంఘం అధ్యక్షునిగా చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎంపిటిసిలు, సొసైటీ డైరెక్టర్లు, జడ్పీటీసీల గెలుపుకు శక్తికి మించి కృషి చేయడం అభినందనీయమని పలువురు రాజకీయ నాయకులు గుర్తు చేస్తున్నారు. రావులపల్లి గ్రామానికి 46 లక్షల మండల పార్కును రప్పించుటకు అలుపెరుగని పోరాటంతో సాధ్యమయ్యింది. ఉద్యమకారుడు రామేశ్వర్ ను పార్టీలోకి రప్పించుటకు చేసిన ప్రయత్నం మరువలేనిది. జడ్పీటీసీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో రామేశ్వర్ ఓడిపోవడం చాలా బాధనిపించింది. మండల పార్టీ సీనియర్ నాయకుడు ప్రభాకర్ గుప్త సలహాలు సూచనలతో ఎమ్మెల్యే ప్రధాన అనుచరునిగా ఎదుగుటకు దోహదపడ్డాయి. ఎంపిపి భట్టు లలిత రమేష్, జడ్పీటీసీ మధుకర్ లు ప్రస్తుతం ఎమ్మెల్యే కు అపూర్వ సహకారం అందిస్తున్నారు. దార్గులపల్లి పల్లె నిద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల షాదీముబారక్ చెక్కులను 53 మందికి ఇప్పించారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో 3 వేల మెజారిటీ వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.