పంచాయతీ కార్యదర్శుల నిర్దిష్ట పని వేళలో మార్పు చేయాలి

Published: Friday September 17, 2021
జిల్లా పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు రంగంపల్లి నర్సిములు
వికారాబాద్ బ్యూరో 16 సెప్టెంబర్ ప్రజాపాలన : పంచాయతీ కార్యదర్శుల పనివేళల్లో మార్పులు చేయాలని జిల్లా పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు రంగంపల్లి నర్సింలు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి (డిపిఓ) మల్లారెడ్డికి పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శుల యాప్ అప్డేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం అన్యాయమని విమర్శించారు. యాప్ అప్డేషన్ చేసుకోవడం వలన భవిష్యత్తులో పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర మనోవేదన కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యదర్శులు అనునిత్యం పని ఒత్తిడితో మానసికంగా శారీరకంగా అచేతన స్థితిలోకి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచించి రోజువారి పని వేళలను మార్చాలని కోరారు. నిర్దిష్ట పనివేళలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సవరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సెలవు దినాలలో పంచాయతీ కార్యదర్శులకు పనులు  అప్పజెప్పరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఉపాధ్యక్షుడు రాజేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వి రామకృష్ణ, కోశాధికారి బాల రంగాచారి, ఉపాధ్యక్షులు రాజేందర్, మాణిక్యం, జాయింట్ సెక్రెటరీలు సత్యనారాయణ,
ఉమ, సుగుణ, బుచ్చయ్య, పబ్లిసిటీ సెక్రటరీ ప్రసన్న, ఈసీ మెంబర్లు కిషన్,రాములు, రమేష్, మహేష్ ,నరేష్ ,నాగయ్య, వికారాబాద్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి అధ్యక్షుడు మహమ్మద్ ఫారూఖ్ హుస్సేన్ పలువురు కార్యదర్శులు ఉన్నారు.