బెల్లంపల్లిలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

Published: Thursday September 09, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, చదువుల తల్లి సావిత్రి బాయి పూలే,ల విగ్రహాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బి సి వి ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్, ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్, రాజేంద్ర ప్రసాద్ ఆర్డీవోకు సమర్పించిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. బుధవారం నాడు వినతి పత్రం ఇచ్చిన తర్వాత వారు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరుగాంచి, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అణగారిన వర్గాలలో చైతన్యాన్ని నింపిన ఆ రోజుల్లోనే చదువుకోవాలని నినదించి ఎన్నో అవమానాలను, కష్టాలను, ఎదుర్కొని మహిళా పాఠశాలను స్థాపించి చదువు తోటి మహిళలకు సమాజంలో సముచిత న్యాయం జరుగుతుందని చెప్పిన త్యాగమూర్తులని అన్నారు. వారు చదువు చెప్పడం తో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వర్తించి వారి జీవితాలను ప్రజల కొరకే అంకితం చేసిన  ఆదర్శ మూర్తులు అని అన్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచిన ఆదర్శ దంపతులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, విగ్రహాలను బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.