మండలంలో అక్రమంగా చెరువు మట్టి తరలింపులు

Published: Thursday June 09, 2022
స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మాకు సంబంధం లేదంటూ సమాధానం
 
 
 
బోనకల్, జూన్ 08 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలోని మట్టి మాఫియా రైతులను అడ్డం పెట్టుకుని ఎక్కడపడితే అక్కడ చెరువులో గోతులు పెట్టేస్తున్నారు.మండలంలో పలు గ్రామాల్లో అక్రమార్కుల కనుసన్నల్లో ఈ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. మండలంలోని కలకోట చెరువు అక్రమ తవ్వకందారులకు అడ్డాగా మారింది.మేం రైతులం, మా పొలాలలో మెరువ చేసుకోవడానికి మట్టి కావాలంటూ తవ్వకందారులు రైతుల ముసుగులో ఇరిగేషన్‌ ఢీఈ, ఆ చెరువు పరిధిలోనీ జేఈ లతో కుమ్మక్కు అయ్యి పర్మిషన్‌లు తెచూకున్నమని నమ్మిస్తూ మట్టి దందా కొనసాగిస్తున్నారు.ఇదే విషయమై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకున్న పాపాన లేదు. కనీసం చెరువు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదనీ వారు మండిపడుతు,మట్టి మాఫియా అక్రమార్కులపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంతో వారికి ఏ స్థాయి మేర ముడుపులు చెందుతున్నాయని మండల ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అందుకనే వారు అంత దైర్యంగా రాత్రి పగలు తేడా లేకుండా సునాయాసంగా జెసిబి లతో మట్టిని తోడేస్తున్నారనీ అంటున్నారు.నిజంగా మట్టి అవసరం ఉన్న వాళ్లు పర్మిషన్‌ కోసం వచ్చారా లేక పర్మిషన్‌ను అడ్డం పెట్టుకుని అక్రమంగా మట్టి తవ్వకాల ద్వారా లక్షలు పోగుజేసుకునేందుకు వస్తున్నారా అనేది కనీసం ఆలోచన చేయకుండా క్షేత్ర స్థాయిలో తవ్వకం, ఎన్ని క్యూబిక్‌ మీటర్లు, ఎక్కడ తవ్వాలో కనీసం చెప్పకుండా పర్మిషన్‌లు ఇవ్వడంలోని అంతరార్థం ఇరిగేషన్‌ అధికారులకే తెలియాలి.ఈ వేసవిలో మండలంలో కలకోటతో పాటు మరి కొన్ని చెరువుల అక్రమ తవ్వకాలకు అధికారులే ఊతం ఇచ్చినట్టయ్యింది. అనుమతులు పొందిన వారిని సాకుగా చూపించి,రైతుల అవసరాలకు కాకుండా వ్యాపారులకు మట్టిని యథేచ్ఛగా తవ్వి గడచిన కొన్ని రోజుల నుంచి మట్టిని తరలిస్తున్నారు. డబ్బు రుచి మరిగిన అక్రమార్కులు అక్రమ తవ్వకాలకు అండగా నిలుస్తున్నారని, ఆయా గ్రామాల్లో ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు.కలకోటలో కనీసం కలకోట గ్రామ పంచాయతీకి సైతం తెలియకుండా చక్రం తిప్పుతూ మట్టి తవ్వకాలు సాగిస్తూ లక్షలు పోగుజేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వీరికి ఇరిగేషన్‌ అధికారులు వత్తాసు పలుకుతూ గ్రామస్థులఫిర్యాదును, వార్త కథనాలను పట్టించుకోకుండా ఫిర్యాదుదారుల పేర్లు,ఫోన్‌ నెంబర్‌లు అక్రమార్కులకు ఇస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చెరువును ఒక క్రమ పద్ధతిలో తవ్వాలని నిబంధనలు ఉన్నా తవ్వకందారులు ఎక్కడ మంచి మట్టి వస్తుంటే అక్కడ గోతులు పెట్టేస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో చెరువుకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరికొంత మంది చెరువుని ఆనుకొని అనుమతులు లేకుండా కొత్త చెరువులను నిర్మిస్తూ పెద్ద పెద్ద పైపులను చెరువు మధ్యలోకి పెడుతున్నారు. సదరు వ్యక్తులు ఏటువంటి అనుమతుల లేకుండా చేపల పెంపకం కోసం చెరువు లను ఏర్పాటు చేస్తున్న అధికారులు కనీసం కన్నెత్తి చూడలేకుండా ఉన్నారని అంటున్నారు.ఇప్పటికైన అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.ఈ విషయం పై స్థానిక మండల అధికారికి వివరణ కోరగా మిషన్ అమృత్ పథకం కింద ఎంపిక కాబడిన పెద్దబీరవల్లి చెరువులో అక్రమ మట్టి తరలింపుపై ఎంపీడీవోకి తెలియజేయగా మాకు సంబంధం లేదంటూ ఉపాధి హామీ పని చేపించేందుకే మా బాధ్యత అని మట్టి తొలకాలతో మాకు సంబంధం లేదు ఏమైనా ఉంటే ఇరిగేషన్ వారిని అడిగి తెలుసుకోండి అంటూ తెలియజేశారు.ఇట్టి విషయంపై ఉన్నతాధికారులు, కలెక్టర్‌ స్పందించాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌ అధికారులు కళ్లు తెరచి.కలకోట చెరువు గర్భాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు, తవ్వకాలు, తరలింపుపై విచారణ చేసి మట్టి తరలింపును నిలుపుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.