నవరసాల కూడిక "సప్త పర్ణిక" ప్రసిద్ధ కవి,సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్

Published: Monday August 29, 2022
కరీంనగర్ ప్రజాతంత్ర ఆగస్టు‌ 28 :
"సప్త పర్ణికలోని కవితలన్ని వైయక్తికమైన స్పందనలుగా కనిపిస్తాయని,చదివిన పాఠకులందరికీ నవరసాల అనుభూతిని పంచుతాయని,సున్నితమైన వస్తువులను వర్ణనలతో అద్భుతంగా వర్ణించిన వనితా రాణి కవిత్వం నిజాలను నిర్భయంగా మన ముందుంచిందని ప్రసిద్ధ కవి,సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ కొనియాడారు.
 
ఆదివారం రోజున కరీంనగర్ లోని ఫిలింభవన్ లో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శ్రీమతి వనితారాణి నోముల రచించిన "సప్త పర్ణిక " కవితా సంపుటిని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ"మనసులను తట్టే కవిత్వం చిరకాలం నిలుస్తుందని, వైవిధ్యమైన శీర్షికలు కవిత్వానికి ప్రాణమని,కవయిత్రి చక్కని శీర్షికలతో సప్త పర్ణికను తీసుకురావడం అభినందనీయమని అన్నారు.విశిష్ట అతిథిగా హాజరైన సుడా ఛైర్మన్ గూడూరి వీర రామకృష్ణారావు మాట్లాడుతూ"ప్రతి ఉద్యమంలో కవుల పాత్ర శ్లాఘనీయమని,సామాజిక మార్పుకోసం కవులు మరింత ముందుండాల"ని అన్నారు.ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి మాట్లాడుతూ"కొన్ని అనుభూతులు మరచిపోలేమని,సప్త పర్ణికలోని ప్రతి కవితను తీర్చి దిద్దిన తీరు కవయిత్రిగా ఆమె కవితా పటిమకు ప్రత్యక్ష సాక్ష్యమ"ని అన్నారు.మరొక విశిష్ట అతిథి, సీనియర్ న్యాయవాది,బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం రాజారెడ్డి మాట్లాడుతూ" కవి ఎప్పుడూ సమాజాన్ని పరిశీలిస్తూ ఉండాలని, సామాజిక సమస్యలపై కవితాస్త్రాలను సంధించాల"ని అన్నారు. వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాసనగొట్టు స్వప్నకృష్ణ పుస్తకాన్ని పరిచయం చేయగా తోట నిర్మలా రాణి,నోముల నరేష్ ప్రసంగించారు. కార్యక్రమంలో మాడిశెట్టి గోపాల్, పి.ఎస్.రవీంద్ర,గంప ఉమాపతి,అన్నాడి గజేందర్ రెడ్డి,అన్నవరం దేవెందర్,గాజోజు నాగభూషణం, కామారపు అశోక్ కుమార్,యన్.మురళీధర్ రావు సదాశ్రీ, బొమ్మకంటి కిషన్,అనూశ్రీ గౌరోజు, తడిగొప్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.