ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ అన్నదాతలు పురుగుమందు డబ్బాలతో ఆందోళన అధికారులు స్పష్టమైన హ

Published: Wednesday February 22, 2023
 బోనకల్, ఫిబ్రవరి 21 ప్రజా పాలన ప్రతినిధి: ఎండిపోతున్న పంటలను కాపాడాలంటూ ఏడు గ్రామాల అన్నదాతలు పురుగుమందు డబ్బాలు చేత పట్టుకొని వైరా జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై బీబీసీ కాలవపై వత్సవాయి - బోనకల్ గ్రామాల మధ్య అన్నదాతలు ఆందోళనకు దిగారు. మూడు గంటలపాటు అన్నదాతల ఆందోళన నిర్వహించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తేనే సాగర్ నీరు వస్తాయని లేకపోతే సాగర నీరు రావని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిర మండలం అల్లినగరం, మడుపల్లి, బయ్యారం, దేశినేనిపాలెం, ఇల్లూరు, రాయపట్నం, బోనకల్ మండల పరిధిలోని మోటమర్రి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది రైతులు ఎండిపోయిన మిర్చి చెట్లను, పురుగుమందు డబ్బాలను తీసుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు శాఖమూరి కోటేశ్వరరావు, సూర్యదేవర సాంబశివరావు మాట్లాడుతూ జనవరి 14న నీటిని విడుదల చేసి 22 వరకు ఇచ్చారని జనవరి 29న నీటిని విడుదల చేసి ఫిబ్రవరి 4 వరకు ఇచ్చారని ఫిబ్రవరి 12న నీటిని విడుదల చేసి 18 వరకు ఇచ్చారని, పంటలు ఎండిపోతున్న సమయంలో ఏనాడు సాగర్ నీరు సక్రమంగా రాలేదని రైతులు తెలిపారు. రెండు నెలల కాలంలో కేవలం 20 రోజులు మాత్రమే దాములూరు మేజర్ కు సాగర్ నీటిని విడుదల చేశారన్నారు. 20 రోజుల కాలంలో పంటలన్నీ ఎలా తడుస్తాయని అన్నదాతలు నిలదీశారు. ఈ గ్రామాలలో మొత్తం 7 వేల ఎకరాలలో మొక్కజొన్న, వరి, మిర్చి పంటలను సాగుచేసినట్లు అన్నదాతలు తెలిపారు. అధికారులతో మాట్లాడితే అధికారులు ఇచ్చిన హామీ కూడా అమలు చేయడం లేదని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు చేసిన పంటలన్నీ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఎండిపోతున్నాయని తెలిపారు. బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సి ఈ శంకర్ నాయక్ రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి రైతుల పంటలను కాపాడుతామని రైతులకు అవసరమైనన్ని రోజులు సాగర్ నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని, కానీ హామీ అమలు చేయకుండా తమ పంటలను అధికారులే ఎండబెడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఆందోళన చేసిన సమయంలో అధికారులు వస్తే సాగర్ నీరు వస్తాయని అధికారులు వెళ్లిన మరుసటి రోజే సాగర నీటి సరఫరాను నిలిపివేస్తారని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమను రోడ్డున పడేస్తున్నారని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. దాములూరు మేజర్ కి 1100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే తమ పంట పొలాలు చేతికి వస్తాయని లేకపోతే రావని తెలిపారు. కానీ అధికారులు మాత్రం కేవలం 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారని దీనివలన తమకు సాగర నీరు అందక ఇబ్బందులు పడుతున్నామని,నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తమకు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఇక్కడ నుంచి చావనైనా చస్తామని అన్నదాతలు హెచ్చరించారు. ఆందోళన సమయంలో ఈ ఈ, ఎస్ ఈ రైతులు ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. కానీ వారు స్పష్టమైన సమాధానం చెప్పకుండా చేతులెత్తేయటం విశేషం. బోనకల్ ఏఎస్ఐ కోడిగంటి నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అద్దంకి ఆనంద్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపారు. దీంతో రైతులు తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. చివరకు ఏఎస్ఐ నీటిపారుదల శాఖ డిఇ పబ్బతి శ్రీనివాస్ తో మాట్లాడారు తాను బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి వస్తున్నానని సమాధానం చెప్పడంతో పోలీసులు కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతులు పాటిబండ్ల గిరిబాబు, చంపసాల గోపాలరావు, ధరావత్ చిట్టిబాబు, మర్రి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.