వయోవృద్ధుల జీవన విధానం భావితరాలకు మార్గదర్శకం. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Saturday August 20, 2022
మంచిర్యాల బ్యూరో, ఆగస్టు 19, ప్రజాపాలన  :
 
వయోవృద్ధులు తమ జీవితంలో ఆచరించిన సన్మార్గపు విధానం భావితరాల అభివృద్ధికి మార్గదర్శకంగా పని చేస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. స్వతంత్ర భారత వబ్రోత్సవ మహోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో శుక్రవారం జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, జైళ్ళలో పండ్లు, మిఠాయిలు పంపిణీలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఆనంద నిలయం అనాధాశ్రమం, వృద్ధాశ్రమంలో వృద్ధులకు, జిల్లాలోని లక్షెట్టిపేటలో గల సబ్ జైలులో ఖైదీలకు పండ్లు, మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలు, పోరాటయోధుల ఉద్యమాల ఫలితంగా లభించాయని, స్వతంత్ర భారత వత్రోత్సవ మహోత్సవం సందర్భంగా మరొక్కసారి ఆ మహనీయుల చరిత్రను స్మరించుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో భావితరాలకు మంచి, చెడు చెప్పడానికి పెద్దవారు ఉండాలని, వృద్ధులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటారని, ఆ అనుభవంతో భవిష్యత్ తరాలు బాగుండాలని తాపత్రయపడు తుంటారని, వారు చూపిన సన్మార్గంలో నడుస్తూ అభివృద్ధి చెందాలని తెలిపారు. పిల్లలు, వృద్ధులు ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని, పిల్లలు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని సాధన దిశగా ప్రయత్నించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. జైలుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఉద్దేశ్యపూర్వకంగా నేరాలకు పాల్పడరని, క్షణికావేశంలో జరిగే సంఘటనల వలన నేరస్తులుగా మారతారని, జైలులో శిక్ష అనుభిస్తున్న వారు శిక్షా కాలం పూర్తయిన తరువాత సత్పవ్రర్తనతో బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి మంచి నడవడికతో జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, బాలల పరిరక్షణ అధికారి ఆనంద్, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్పర్సన్ నల్మాసు కాంతయ్య, జైలర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.