మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య చిచ్చు పెట్టవద్దు : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడ

Published: Wednesday September 15, 2021
హైదరాబాదు, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో యస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే రాజకీయ నాయకులకు ఘాటుగా సమాధానం ఇచ్చిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9వ తేదీన వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని ప్రకటించడం రెండు తెలుగు రాష్ట్రాల లోని మాల మనోభావాలను దెబ్బ తీయడమేనని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పును ఇచ్చింది. జాతీయ ఎస్సీ కమిషన్ మరియు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వర్గీకరణ సాధ్యం కాదని పలు దఫాలుగా పార్లమెంటుకు నివేదించడం దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయని పార్లమెంటులో సైతం ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. స్వయానా అన్నగారైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర నిండు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీల వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని ప్రకటించిన సంగతి వైయస్ షర్మిల కు తెలియదా? అని చెన్నయ్య ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించడం తోనే వర్గీకరణ సమస్య  పోయిందని ఇరు రాష్ట్రాల్లోనూ దళితులు వర్గీకరణ వైపు కాకుండా రాజ్యాధికారం కోసం ఉమ్మడి ఉద్యమాలు నిర్మించి పోరాటాలు చేస్తున్న ఈ తరుణంలో షర్మిల అలాంటి అగ్రవర్ణ పార్టీల నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉన్న దళితుల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలించే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. దళితులు రాజ్యాధికారం లోకి రాకుండా తమ వాటా పొందకుండా కుట్రలు చేస్తున్నారని చెన్నయ్య ధ్వజమెత్తారు. దేశంలో దళితులు స్థాపించిన ఆర్.పి.ఐ,. బి.ఎస్.పి లోక్ జనశక్తి లాంటి పార్టీలు వర్గీకరణకు వ్యతిరేకమన్నారు. కానీ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉండడం లో అర్థం గ్రహించారని చెన్నయ్య దళితులను కోరారు. కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపి రాజ్యాధికారం కోసం దళితులంతా ఏకం కావాలన్నారు. ఐక్య ఉద్యమాలు నిర్మహించి రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడాలని చెన్నయ్య పిలుపునిచ్చారు. గత 27 సంవత్సరాలుగా ఈ వర్గీకరణ ఉద్యమాల వల్ల మన మాల-మాదిగలు ఎంత నష్టపోయామో గ్రహించాలని చెన్నయ్య దళితులను కోరారు. వైయస్ షర్మిల కు రాజ్యాంగ అధికరణలు 341, 342 తదితర  సవరణ విధానం పద్ధతి గురించి అసలు తెలుసా? ఎస్సీల వర్గీకరణ ఎలా సాధ్యపడుతుందని చెన్నయ్య షర్మిలను ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై ఎవరు కామెంట్ చేసినా అది కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాలను మాలలు అడ్డుకోవాలని రాబోయే ఎన్నికలలో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి రవి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి వడాలా భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ మద్దెల వెంకటయ్య, యూత్ అధ్యక్షుడు జీ రమేష్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి బంగి ఆనందరావు, హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు డేవిడ్, బంజారాహిల్స్ డివిజన్ అధ్యక్షుడు శేఖర్, హయత్నగర్ అధ్యక్షుడు గణేష్ తదితరులు పాల్గొన్నారు.