ధారూర్ జాతర భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

Published: Thursday November 10, 2022
జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 9 నవంబర్ ప్రజా పాలన : ధారూర్ జాతరకు వచ్చే భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు.
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ధారూర్ జాతరకు సంబంధించి ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, ధారూర్ జాతర సొసైటీ సభ్యులతో డి ఆర్ ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా కరోనా సందర్భంగా జాతరకు భక్తుల సందడి ఎక్కువగా ఉండేదని, ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని దానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేపట్టాలని ఆయన తెలిపారు. జాతర సందర్భంగా ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవల నిమిత్తం వైద్య శిబిరాలను నిర్వహించి వైద్య సిబ్బందితోపాటు మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. జాతర ప్రాంతంలో పారిశుద్ధ్య పనులతో పాటు నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. త్రాగు నీటి సమస్య తలెత్తకుండా గతంలో కంటే అదనంగా స్థలాలను గుర్తించి సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకుంటూ అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెద్ద మొత్తంలో టాయిలెట్స్,  స్నానాల గదుల  ఏర్పాటు చేయడంతో పాటు నీరు సమృద్ధిగా ఉండేలా చూడాలని  సూచించారు. జాతరలో విద్యుత్తు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. జాతరకు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులకు సూచించారు.  జాతరలో వ్యర్ధ పదార్థాలు,  చెత్తచెదారాన్ని వేసేందుకు డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయాలన్నారు. జాతరకు వెళ్లే రోడ్లను పరిశీలించి రోడ్ల ఏర్పాటుకు అంచనాలను రూపొందించి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారికి సూచించారు. గ్రామపంచాయతీ,  జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో జాతర జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పాల్వన్ కుమార్, పంచాయత్ రాజ్ ఇ.ఇ. శ్రీనివాస్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్ , ఫారెస్ట్ రేంజ్ అధికారి అరుణ, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ సాయి రెడ్డి , ధారూర్ తాసిల్దార్ భువనేశ్వర్, ఎంపీడీవో చంద్రశేఖర్ , ధారూర్ జాతర ఉత్సవ కమిటీ కార్యదర్శి దయానంద్,  కోశాధికారి స్టీవెన్, కమిటీ సభ్యులు గాబ్రియల్ , ఇమాన్యుయల్, జాన్ విక్టర్,  సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.