ముందస్తుగా బిజెపి శ్రేణులను నిర్బంధించిన మీర్ పేట్ పోలీసులు

Published: Wednesday November 17, 2021
బాలాపూర్, నవంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : కాషాయ దళం కదం తొక్కితే.... గులాబీ మిడతల దండు విలవిలలాడుతుందని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున బీజేపీ శ్రేణులతో తరలివెళ్లేందుకు శ్రీరాములు యాదవ్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మీర్ పేట్ పోలీసులు తొలుత గృహ నిర్బంధం చేసి పీ ఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని బీజేపీ చెబితే.. టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్... కేంద్రంపై అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలకు అండగా ఉండేందుకు యాత్ర చేబటితే టీఆర్ఎస్ గుండాలు కాన్వాయ్ పై దాడులు చేయటం సరి కాదని అన్నారు. తెలంగాణలో ప్రజాగొంతును వినిపించే వాక్ స్వాతంత్య్రం లేకుండా గొంతు నొక్కేస్తున్నారని అన్నారు. వాహనాల ధ్వంసం, టీఆర్ఎస్ అరాచక శక్తుల విధ్వంసకాండకు సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, మీర్ పేట కార్పొరేషన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలా రవినాయక్, సహా ఫ్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, జీఎస్ గాజుల మధు, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణారెడ్డి, పెద్దబావి నాగనందీశ్వర్ రెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగుడెం రామకృష్ణారెడ్డి, సహా కార్పొరేటర్లు కరుణానిధి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు శ్రీను, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, కొండల్ గౌడ్, లాలం కొండల్ యాదవ్, తోపాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు కార్యకర్తలను మీర్ పేట పోలీసులు నిర్బంధించారు.