పులుమద్ది గ్రామస్థులకు ఎనీ టైం వాటర్

Published: Tuesday November 23, 2021
సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజాపాలన : పులుమద్ది గ్రామస్థులందరికీ కేవలం రూ.5లకే 20 లీటర్లు శుద్ధిచేయబడిన తాగు నీటిని అందించనున్నామని గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ రాంరెడ్డి, కార్యదర్శి షాహేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో శుద్ధి చేసిన తాగునీటి సరఫరాకు ఏటిడబ్ల్యూ (ఎనీ టైం వాటర్) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్థుల ఆరోగ్యపరిరక్షణే లక్ష్యంగా శుద్ధిచేసిన నీటిని 24/7 రోజులలో అందిస్తామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, బోరు, బావులలో లభించే నీటి కంటే శుద్ధి చేసిన నీటిని తాగడం ఆరోగ్యానికి శ్రేష్ఠమని వివరించారు. శుద్ధి చేయబడిన నీటిని పొందుటకు కార్డుకు రూ. 50 లు, క్యాన్ కు రూ.300 లు చెల్లించాలని సూచించారు. ఒక్క క్యానులో 20 లీటర్ల నీటిని పొందుటకు రూ.5లు ఏటిడబ్ల్యూ కార్డు ద్వారా ఆటోమేటిక్ సిస్టమ్ తో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. శుద్ధి చేసిన నీటిని పొందుటకు అతి తక్కువలో తక్కువ రూ.100 లు రీచార్జ్ చేసుకోవలసి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గయాజ్, ఎంపిటిసి అనసూజ ప్రభాకర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు వెంకటయ్య, వార్డు మెంబర్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శ్యామయ్య గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.