రాష్ట్ర సరిహద్దులో నాకాబందీ

Published: Friday May 28, 2021
పరిశీలించి సీపీ విష్ణు యస్ వారియర్..
ఖమ్మం, మే 27, ప్రజాపాలన ప్రతినిధి : లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు లోని చెక్ పోస్ట్ లను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ సందర్శించి తనిఖీ చేశారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులలో కొనసాగుతున్న చెక్ పోస్టులను పోలీస్ కమిషనర్ తనిఖీ చేసి అక్కడి పరిస్థితులను తెలుసుకొన్నారు. బోనకల్లు మండలం  వాత్సవాయి రోడ్డు  సరిహద్దు చెక్ పోస్ట్ , మధిర రూరల్ పరిధిలోని మాటూరు చెక్ పోస్టులను గురువారం పోలీస్ కమిషనర్ సందర్శించారు. లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. రోజులో ఎన్ని ఎమర్జెన్సీ అంబులెన్స్, నిత్యావసర రవాణా వాహనాలు వస్తున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మెడికల్ అంబులెన్స్, నిత్యావసర సర్వీసులు, పాసులు వున్న వారికి మినహా ఇతరులు ఎవరూ రాష్ట్ర సరిహద్దు ప్రవేశ మార్గాలు దాటకుండ మరింత అప్రమత్తంగా ఉండాలని, చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత కఠినం చేయాలని పోలీస్  అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారుల పర్యవేక్షణలో వాలాంటరీలు లాక్ డౌన్ మార్గదర్శకాలు పాటిస్తూ.. కరోనా వైరస్‌ నుంచి తమ గ్రామాల ప్రజలను రక్షించుకునేందుకు గ్రామ సరిహద్దుల బంద్‌ కొనసాగుతోందని. ఇప్పటికే జిల్లాలోని పలు సరిహద్దు గ్రామాల్లో యువత. వాలంటరీలు గ్రామాల మీదుగా కొత్త వ్యక్తులెవరూ వెళ్లకుండా, గ్రామాల్లోకి రాకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారని కమిషనర్  తెలిపారు.