యజ్ఞంలా కొనసాగుతున్న పల్లెప్రగతి

Published: Monday July 05, 2021
వికారాబాద్ జూలై 04 ప్రజాపాలన బ్యూరో : పల్లె ప్రాంతాలు పచ్చని మొక్కలతో పచ్చందాలను పరిమళింపజేస్తున్నాయి. పల్లె వాసులకు స్వచ్ఛమైన ఆక్సీజన్ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి పల్లె ప్రవేశ రోడ్డుకు ఇరువైపుల కోనపర్పస్ మొక్కలు పచ్చని అందాలు విరజిమ్ముతున్నాయి. గ్రామాలకు వచ్చే వారి చూపును కదలనివ్వడంలేదు. గ్రామాల సర్పంచులు, కార్యదర్శుల కృషికి అద్దం పట్టేలా హరితహారం కొనసాగుతున్నది. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని బురాన్ పల్లి, బురాన్ పల్లి తాండ, కామారెడ్డిగూడ, పాతూర్, పులుసుమామిడి, పీరంపల్లి గ్రామాలలో మొక్కల పంపిణీ, శ్రమదానం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బురాన్ పల్లి గ్రామ సర్పంచ్ మమత సాయిక్రిష్ణగౌడ్, కార్యదర్శి రాములు. కామారెడ్డిగూడ సర్పంచ్ సామల పురుషోత్తంరెడ్డి, కార్యదర్శి శిల్ప. పాతూర్ సర్పంచ్ దొడ్ల లలిత నర్సింహారెడ్డి, కార్యదర్శి సుహాసిని. పులుసుమామిడి సర్పంచ్ నారెగూడెం కమాల్ రెడ్డి, కార్యదర్శి రాములు. పీరంపల్లి సర్పంచ్ జయమ్మ నరేందర్ రెడ్డి, కార్యదర్శి రుక్మిణిల నిరంతర శ్రమ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నది. తులసి, జామ, నిమ్మ, గులాబి, మందార, ఉసిరి, కరివేపాకు, బొప్పాయి మొక్కలలో ఇంటి యజమానులకు అవసరమైనవి 6 మొక్కల చొప్పున పంపిణీ చేయడం విశేషం. సిఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన పల్లె ప్రగతిని ప్రతి గ్రామ సర్పంచ్, కార్యదర్శి పట్టు వదలని విక్రమార్కుల్లా కృషి చేస్తున్నారని గ్రామీణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంతో పని చేస్తున్నామని సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.