వికారాబాద్ జిల్లా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు

Published: Monday January 30, 2023
టీయూడబ్ల్యూజే-ఐజేయు జిల్లా 2023 డైరీని ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 29 జనవరి ప్రజాపాలన :  వికారాబాద్ జిల్లాలో ఉన్న  జర్నలిస్టులందరికి  ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం టీయూడబ్ల్యూజే-ఐజేయు వికారాబాద్ జిల్లా 2023 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని, దీనికి గాను జర్నలిస్టుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.  జర్నలిస్టు సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. టియు డబ్ల్యూజే-ఐజేయు వికారాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి, శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో జిల్లాలోని జర్నలిస్టుల తరఫున ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల పిల్లలకు  ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులలో రాయితీ కల్పించినందుకు మంత్రికి  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డి.ఆనంద్, పి.చుక్కయ్య, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ జాక  వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.