నిఖార్సైన తెలంగాణవాది కొండా లక్ష్మణ్ బాపూజీ

Published: Tuesday September 28, 2021
బిసి కమిషన్ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్
వికారాబాద్ బ్యూరో 27 సెప్టెంబర్ ప్రజాపాలన : నిజాం పాలనను అంత మొందించేందుకు రచన చేసింది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ కమిషన్ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధ్యక్షతన జిల్లా బిసి సంక్షేమ అధికారి అన్నపరెడ్డి పుష్పలత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ అని కొనియాడారు. నిజాం పాలనను అంతం చేయడానికి, తిరుగుబాటుకు రచన చేసింది బాపూజీనేనని గుర్తు చేశారు. బాపూజీ పోరాటాలను ఐదు రకాలుగా విడదీసుకోవాలని స్పష్టం చేశారు. మొదటిది భారత స్వాతంత్ర్య ఉద్యమం. రెండవది ముల్కీ ఉద్యమం. మూడవది 1969 తెలంగాణ పోరాటం. నాలుగవది తెలంగాణ ఉద్యమం. ఐదవది తన సామాజిక అభివృద్ధి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పైన దృష్టి పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరోదారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ రాష్ట్రానికి నాంది పలికారు. తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు. బాపూజీ ఆశయాలను సాధిస్తున్న ఏకైక ప్రభుత్వం సిఎం కేసీఆర్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్, టిఆర్ఎస్ యువజన పట్టణ ప్రధాన కార్యదర్శి దత్తు,  కేదార్ నాథ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.