ఓటమి భయంతోనే మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు : గజ్జెలకాంతం హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధ

Published: Saturday November 19, 2022

ఓడిపోతానన్న భయంతోనే పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మహిళా నాయకురాలు కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఒక మహిళ ఎమ్మెల్సీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జలకాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవితో కలిసి మాట్లాడారు. నిత్యం దేశం కోసం ధర్మం కోసం అని వల్లించే బిజెపి పార్టీలో ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే అదే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు భౌతిక దాడులకు సైతం వెనుకాడ బోరని హెచ్చరించారు.ఆడపడుచులను గౌరవించడం ఒక పార్లమెంట్ సభ్యుడికి తెలియక పోవడం దారుణం అన్నారు.బిజెపి పార్టీ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలంగాణపై ఉక్కు పాదం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆధీనంలో ఉన్న ఈ డి,  ఐ టి, సి బి ఐ సంస్థలను ఉపయోగించుకొని ఇతర పార్టీల నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. బిజెపి ధర్మబద్ధంగా పాలిస్తే బిజెపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, ముఖ్యంగా ఆదాని,అంబానీ లాంటి వారి పై దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక ఉద్యమాలు తప్పవని,తెలంగాణ ఉద్యమం లో అరవింద్ జాడ ఎక్కడ అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల కోసం అరవింద్ ఎప్పుడైనా పోరాటం చేశారా అన్నారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశం, అంజి మాదిగ, సాయి, నక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు.